నాంపల్లి, మే 29 :పదవుల కొట్లాటలు తప్ప జనం సమస్యలు పట్టని పార్టీలు బీజేపీ, కాంగ్రెస్ అని, ఆ పార్టీ నాయకులకు పాలనపై అవగాహన లేదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. సోమవారం నాంపల్లి మండలం పస్నూర్‌లో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం పండుగలా సాగింది. మంత్రి జగదీశ్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ కాంగ్రెస్, బీజేపీలు ప్రజా క్షేత్రంలో ఎప్పుడో ఫెయిల్ అయ్యాయని, గతంలోనే చెయ్యి పార్టీకి పతనం మొదలు కాగా, కర్ణాటక ఎన్నికల ఫలితాలతో కమలం పార్టీకి అంటుకుందని అన్నారు. గ్రామీణాభివృద్ధిలో రాష్ట్రానికి ఇటీవల జాతీయ స్థాయి అవార్డులు ఎన్నో వచ్చాయని, పల్లెల్లో జరుగుతున్న అభివృద్ధి పనులే ఇందుకు నిదర్శనమని తెలిపారు. గొప్పలు చెప్పుకొంటున్న డబుల్ ఇంజిన్ సర్కార్‌లో గుజరాత్ సహా బీజేపీ పాలిత రాష్ర్టాలకు అవార్డులు ఎందుకు రాలేదని ప్రశ్నించారు. తెలంగాణలో నిర్మాణాత్మకమైన ప్రతిపక్షం లేదని, బీజేపీ, కాంగ్రెస్ నాయకులు దశాబ్ది ఉత్సవాలపై అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని
మండిపడ్డారు. తెలంగాణ రాష్ర్టానికి సీఎం కేసీఆరే శ్రీరామ రక్ష అని, రానున్న ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో 12 సీట్లలో
బీఆర్ఎస్దే గెలుపు అని స్పష్టం చేశారు.
‘బీజేపీ, కాంగ్రెస్ ప్రజాక్షేత్రంలో ఫెయిల్యూర్ పార్టీలు. చుక్కాని లేని నావలా తయారైన కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో ఫెయిల్ అయింది. కర్ణాటక ఓటమితో బీజేపీకి ఫెయిల్యూర్ స్టోరీ మొదలైంది. పీసీసీ ప్రెసిడెంట్ పదవి కొనుక్కొచ్చుకున్నదే. అటువంటి వారికి పాలనాపరమైన అవగాహన ఎందుకుంటుంది.’ అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. నాంపల్లి మండలంలోని పస్నూరు గ్రామంలో ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి అధ్వర్యంలో సోమవారం నిర్వహించిన బీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్, కల్లు గీత కార్పొరేషన్ చైర్మన్ పల్లె రవికుమార్ గౌడ్‌తో కలిసి మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఉద్యమ సమయంలో ఆంధ్రా పాలకుల మోచేతి కింద బతికినోళ్లకు తెలంగాణ దశాబ్ది ఉత్సవాల ప్రాశస్త్యం ఏం తెలుస్తుందని ప్రశ్నించారు. పురిటిలోనే బిడ్డను గొంతు నులిమి చంపినోళ్లే కర్మకాండ నిర్వహిస్తామన్న చందంగా బీజేపీ ప్రవర్తిస్తున్నదన్నారు. 500 మెగావాట్ల సీలేరు విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని ఆంధ్రాలో కలుపడమే ఇందుకు తార్కాణమని పేర్కొన్నారు.
కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో పాలనా సౌలభ్యం కోసం ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు కావాలని సీఎం కేసీఆర్ కేంద్రానికి అర్జీ పెట్టుకుంటే సంవత్సరం వరకు ఆ ఫైల్ మొహం చూడలేదని విమర్శించారు. సీలేరు విద్యుత్ ఉప కేంద్రాన్ని ఆంధ్రాకు అప్పగించే కుట్రలో భాగంగానే తెలంగాణలోని ఏడు మండలాలను ఏపీకి అప్పగించారని దుయ్యబట్టారు. అటువంటి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు దశాబ్ది ఉత్సవాల గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉన్నదని విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వం ఫెయిల్యూర్ అయితే.. జాతీయ స్థాయిలో అన్ని అవార్డులు ఎలా వస్తాయని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం గ్రామీణాభివృద్ధిలో 10 అవార్డులు ప్రకటిస్తే.. మొదటి 7 తెలంగాణవేనని, 20లో 19 మన రాష్ర్టానికే వచ్చాయని తెలిపారు. గొప్పలు చెప్పుకొంటున్న డబుల్ ఇంజిన్ సర్కార్ ఏలుబడిలో గుజరాత్ సహా బీజేపీ పాలిత రాష్ర్టాలకు అవార్డులు ఎందుకు రాలేదని ప్రశ్నించారు. తెలంగాణలో నిర్మాణాత్మకమైన ప్రతిపక్షం లేదని, అపరిపక్వతతో కూడిన నాయకత్వంతో బీజేపీ, కాంగ్రెస్ నాయకులు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని అన్నారు.
వారి దుష్ప్రచారాన్ని క్షేత్రస్థాయిలో తిప్పికొట్టాలని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ మదిలో పుట్టినవే రైతుబంధు, రైతు బీమా, కల్యాణలక్ష్మి, 24 గంటల విద్యుత్ వంటి పథకాలు అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలతో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల అభ్యర్థులకు డిపాజిట్లు కూడా దక్కవని పేర్కొన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 12 స్థానాల్లో బీఆర్ఎస్ గెలిచి చరిత్ర సృష్టించబోతున్నదని మంత్రి తెలిపారు. నల్లగొండలో పెద్ద లీడర్లమని చెప్పుకొంటున్న కాంగ్రెస్ నాయకులు జిల్లాకు చేసింది శూన్యమని విమర్శించారు. వారికి ఎప్పుడూ పదవుల కొట్లాట తప్ప ప్రజల సమస్యలు పట్టవని, హైదరాబాద్‌లో ఏసీ రూములకు పరిమితమైన వారు అభివృద్ధి ఏమీ చేయలేదని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటుంటే.. రాజకీయంగా ఎదుర్కొనే ధైర్యంలేక కేంద్ర సర్కారు రాష్ట్ర ప్రభుత్వంపై విషం కక్కుతున్నదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో బండి సంజయ్, రేవంత్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సహా పార్టీలతో సంబంధం లేకుండా ప్రతిఒక్కరూ ఏదో ఒకరకంగా లబ్ధి పొందుతున్నారని తెలిపారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న సీఎం కేసీఆర్ పాలనే తెలంగాణకు శ్రీరామ రక్ష అన్నారు. కార్యక్రమంలో కల్లు గీత సహకార అభివృద్ధి సంస్థ చైర్మన్ పల్లె రవికుమార్ గౌడ్, ఎంపీపీ ఏడుదొడ్ల శ్వేత, మాల్ మార్కెట్ కమిటీ చైర్మన్ దంటు జగదీశ్వర్, రైతుబంధు సమితి మండల కన్వీనర్ ఏడుదొడ్ల రవీందర్‌రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కుంభం కృష్ణారెడ్డి, మండలాధ్యక్షుడు గుమ్మడపు నర్సింహారావు, నాయకులు పోగుల వెంకట్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి, వెంకటేశ్వర్లు, జగన్మోహన్రెడ్డి, శ్రీశైలంయాదవ్, యాదయ్య, ప్రభాకర్‌రెడ్డి, సర్ధార్ నాయక్, యాదయ్య పాల్గొన్నారు.
మునుగోడులో బీఆర్ఎస్కు తిరుగులేదు ;ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి
మునుగోడు నియోజకవర్గంలో కార్యకర్తల బలగంతో బీఆర్ఎస్ బలంగా ఉన్నది. ఉప ఎన్నికల్లో మరోసారి అవకాశం ఇచ్చిన నియోజకవర్గ ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తా. ఫ్లోరోసిస్ నుంచి విముక్తి చేయడానికి చౌటుప్పల్‌లో మిషన్ భగీరథ పైలాన్ ఏర్పాటు చేసి ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీరు అందిస్తున్నాం. తాగునీరుతో పాటు సాగునీరు అందించేందుకు మర్రిగూడ మండలంలోని శివన్నగూడెంలో, నాంపల్లి మండలం లక్ష్మణాపురంలో ప్రాజెక్టులు నిర్మిస్తున్నాం. ఇప్పటి వరకు నియోజకవర్గంలో రూ.72 కోట్లతో సీసీ రోడ్లు వేశాం. త్వరలో రూ.90 కోట్లతో బంగారిగడ్డ నుంచి కొండమల్లేపల్లి వరకు డబుల్ రోడ్డు నిర్మాణం చేపడుతాం. పార్టీ కోసం పని చేసిన ప్రతి కార్యకర్తకు అన్ని విధాలా అండగా ఉంటాం.