బీఆర్ఎస్ పాలనలోనే తండాలు సమగ్రాభివృద్ధి సాధించాయని, వివిధ సంక్షేమ కార్యక్రమాలతో సీఎం
కేసీఆర్ గిరిజనుల్లో ఆత్మగౌరవం నింపారని బీఆర్ఎస్ ఆలేరు అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే గొంగిడి సునీతా
మహేందర్‌రెడ్డి అన్నారు. తుర్కపల్లి మండలంలోని పలు తండాల్లో గురువారం ఆమె ఎన్నికల ప్రచారం
నిర్వహించారు. గిరిజన మహిళలు మంగళహారతులు పట్టి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సునీత మాట్లాడుతూ 500 జనాభా కలిగిన ప్రతి తండాను ప్రభుత్వం గ్రామ పంచాయతీగా మార్చిందని, తండాలకు బీటీ రోడ్లు, వీధివీధినా సీసీ రోడ్లు నిర్మించిందని అన్నారు. ఇంటింటికీ స్వచ్ఛమైన మిషన్ భగీరథ నీరు అందిస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే మళ్లీ కరెంట్ కష్టాలు తప్పవని చెప్పారు. మరింత అభివృద్ధికి తనకు మరోసారి అవకాశం ఇవ్వాలని కోరారు.
తుర్కపల్లి, నవంబర్ 16 : బీఆర్ఎస్ పాలనలోనే గిరిజన తండాలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాయని ప్రభుత్వ విప్, బీఆర్ఎస్ ఆలేరు ఎమ్మెల్యే అభ్యర్థి గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి అన్నారు. గురువారం తుర్కపల్లి మండలంలోని బీల్యాతండా, బద్దుతండా, జగ్యాతండా, ధర్మారం, ధర్మారంపెద్దతండా, కర్షలగడ్డతండా, రామోజీతండా, గొల్లగూడెం, మర్రి కుంట తండా, దేవోజీతండా, గోగులగుట్టతండా, మోతీరాంతండా, కొత్తబావితండా, బాబ్లూనాయక్తండా, కర్రెబావితండా, రాములుతండా, పెద్దతండా, సూక్యతండా, చోక్లాతండా, కోక్యాతండా, జేతిరాంతండా, మామిడికుంటతండ, సంగ్యాతండాలలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు సుధగాని హరిశంకర్‌గౌడ్‌తో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మండలంలో 8 గిరిజన తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చి సీఎం కేసీఆర్ గిరిజనుల ఆత్మగౌరవం పెంచారన్నారు.
గత పాలకులు తండాలను పట్టించుకోకపోవడంతో అభివృద్ధికి నోచుకోలేదని, తాగు నీటి కోసం బిందెలు పట్టుకొని కిలోమీటర్ల కొద్ది వ్యవసాయబావుల వద్దకు వెళ్లి తెచ్చుకునేవారన్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తరువాత మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ గోదావరి జలాలు అందిస్తున్నట్లు తెలిపారు. తుర్కపల్లిలో గ్రీన్ ఇండర్స్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు కృషి చేశామన్నారు. ఇండర్స్ట్రీయల్ ఏర్పాటుకు 138 ఎకరాల స్థలం సేకరించామని, రైతులకు పరిహరం సైతం అందించి సేకరించిన భూమిని టీఎస్ఐఐసీకి అప్పగించినట్లు తెలిపారు. త్వరలోనే పరిశ్రమలు స్థాపించి ఈ ప్రాంత నిరుద్యోగ. యువతకు ఉపాధి కల్పిస్తామన్నారు. వ్యవసాయానికి 3గంటల కరెంట్ చాలు అని, రైతు బంధు తీసుకునే బిచ్చగాళ్లు అని రేవంత్‌రెడ్డి ఆహంకార పూరిత మాటలు మాట్లాడుతున్నాడని, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరణి ఎత్తివేస్తామని చెబుతున్నాడని, ఇలాంటి వారు అవసరమా అని ప్రజలు ఆలోచించాలన్నారు.
మరోసారి ఆశీర్వదిస్తే నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని తెలిపారు. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు సుధగాని హరిశంకర్‌గౌడ్ మాట్లాడుతూ ఎమ్మెల్యేగా రెండు సార్లు గెలిచిన గొంగిడి సునీత ఆలేరును అభివృద్ధిలో అగ్రభాగంలో నిలిపిందని, మరోసారి అవకాశం ఇచ్చి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో జడ్పీ వైస్‌చైర్మన్ ధనవత్ బీకునాయక్, ఎంపీపీ బూక్యా సుశీలారవీందర్, పీఏసీఎస్ చైర్మన్ సింగిరెడ్డి నరసింహారెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పిన్నపురెడ్డి నరేందర్‌రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ గట్టు తేజస్వీనిఖిల్, అధికార ప్రతినిధి తలారి శ్రీనివాస్, సర్పంచులు పోగుల ఆంజనేయులు, సత్యనారాయణ, ఎంపీటీసీ గిద్దె కర్ణాకర్, బీఆర్ఎస్వీ నియోజకవర్గ అధ్యక్షుడు ర్యాకల రమేశ్‌యాదవ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు మోతీరాం, వెంకటేశ్, మాజీ ఎంపీపీలు బబ్బూరి రవీంద్రనాథ్‌గౌడ్, బొరెడ్డి రాంరెడ్డి, బంజార సేవ సంఘం నియోజకవర్గ అధ్యక్షుడు బూక్యా రవీందర్, భాస్కర్‌నాయక్, రాజయ్య పాల్గొన్నారు.