యాదగిరిగుట్ట, ఫిబ్రవరి 20: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. 3వ రోజు శుక్రవారం ఉదయం 10.30 గంటలకు స్వామివారు మత్స్యావతారంలో భక్తులకు దర్శమిచ్చారు. రాత్రి శేషవాహన సేవలో తిరుమాఢవీధుల్లో ఊరేగారు. శ్రీవైకుంఠంలో స్వామివారికి నిరంతరం అవిచ్ఛన్నమైన సేవా కైంకర్యాలు చేసే సేవకుడు అనంతుడు. అతనే ఆదిశేషు. ఆదిశేషుడిలో ప్రవాసుదేవుడిలా స్వామివారిని అలంకరించి ఆస్థానం చేశారు. వేదాలు, పురాణాలతో ప్రార్థించారు. బ్రహ్మోత్సవ శుభరాత్రుల్లో యాదగిరికొండపై జ్వాలాకృతిలో.. సర్పాకారంలో వెలసిన స్వామివారు శ్రీదేవి, భూదేవి సమేతంగా ఆదిశేష వాహనాన్ని భక్తులు కనులారా దర్శించుకున్నారు. బ్రహ్మోత్సవంలో ఉదయం స్వామివారి దివ్య అలంకార సేవ, రాత్రి దివ్య అలంకార సేవలు, హవన పూజలు యాజ్ఞికులు, ప్రధానార్చకులు చేపట్టారు.
వాహనం అనగా మోయునది అని అర్థం. భగవంతుడిని భక్తుల వద్దకు చేర్చు పరమభాగవతోత్తములను వాహనాలుగా స్వీకరించి భగవానుడు భక్తకోటికి దర్శనభాగ్యం కలిగిస్తున్నాడని, బ్రహ్మోత్సవాలలో ప్రప్రథమంగా శేషవానారూఢుడై భగవానుడు భక్తులకు దర్శనమిచ్చారు. సాయంత్రం స్వామివారి శేష వాహనాన్ని పశ్చిమ రాజగోపురం గుండా ఉత్తరం, తూర్పు, దక్షిణ మాఢవీధుల్లో ఊరేగించారు. తూర్పు రాజగోపురం ముందు ప్రత్యేక మండపంలో వేంచేపు మండపంలో అధిష్టింపజేసి సేవించారు. శ్రీహరి పాదపద్మములను సమస్కరించేటప్పుడు పాదపీఠంగా ఉన్న ఆదిశేషునికి సర్వదేవతాధిపతియైన శ్రీమహావిష్ణువు ప్రథమ నమస్కార అర్హతను అప్రయత్నంగా అనుగ్రహించడం ఆదిశేషువుపై పరమాత్మకు గల అవాజ్యమైన కృపగా భక్తులు భావిస్తూ శేషవానారూఢుడైన అలంకార సేవలో స్వామివారిని దర్శించుకున్నారు. బ్రహ్మోత్సవాలలో భాగంగా ధార్మిక, సాహిత్య, సంగీత మహాసభలు భక్తులను ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్త బి.నరసింహమూర్తి, కార్యనిర్వహణాధికారి భవానీశంకర్, డీఈవో దోర్భాల భాస్కర్ శర్మ, ఆలయ ప్రధానార్చకులు కాండూరి వెంకటాచార్యులు, భటర్ సురేంద్రాచార్యులు, యాజ్ఞాచార్యులు, ముఖ్య అర్చకులు తదితరులు పాల్గొన్నారు.
యాదగిరికొండపై పంచనారసింహుడిగా కొలువైన దేవదేవుడి మత్స్యావతార అలంకార వైభవం భక్తజనులను అలరించింది. ఉదయం నిత్యపూజ కైంకర్యాల అనంతరం స్వామివారికి మూలమంత్ర, మూర్తి మంత్ర హోమాలు యజ్ఞాచార్యులు, పారాయణందారులు, ప్రధానార్చకులు, ఉప ప్రధానార్చకులు, అర్చక బృందం అత్యంత వైభవంగా నిర్వహించారు. అనంతరం స్వామివారికి అభిషేకోత్సవం నిర్వహించారు. ప్రధానాలయ వెలుపలి ప్రాకారంలోని కల్యాణ మండపంలో స్వామివారిని మత్స్యావతారంలో అలంకరించి పశ్చిమ రాజగోపురం గుండా ఉత్తరం, తూర్పు, దక్షిణ మాఢవీధుల్లో ఊరేగించారు. మత్స్యావతారంలో స్వామివారి నాలుగు వేదాల పుస్తకాలను చేతబూని భక్తులకు దర్మనమిస్తూ కనువిందు చేశారు. భక్తజనులు గోవిందనామ స్మరణ చేస్తూ ప్రధానాలయ తిరుమాఢవీధుల్లో స్వామివారి అలంకార సేవ సాగింది. పట్టువస్ర్తాలు, బంగారు, వజ్రాభరణాలు, వివిధ రకాల పుష్పాలతో దివ్యమంగళకరంగా అలంకరించిన స్వామివారిని తూర్పు రాజగోపురం ముందు ప్రత్యేకంగా సిద్ధం చేసిన మండపంలో అధిష్టింపజేసి సేవించి తరించారు. నాలుగు వేదాలు, పురాణాలు, ఉపనిషత్తులు, దివ్యప్రబంధ ప్రాశుర పఠణాలు కనులపండువగా చేపట్టారు.