కోదాడ, డిసెంబర్ 8 : రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఎమ్మెల్యే పద్మావతి నిబద్ధతను సంవత్సర కాలంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన శిలాఫలకాలు వెక్కిరిస్తున్నాయని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ అన్నారు. కోదాడలోని ఆయన నివాసంలో ఆదివారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నియోజకవర్గంలో ఫిబ్రవరిలో శంకుస్థాపన చేసిన అభివృద్ధి పనులకు సంబంధించి ఇప్పటి వరకు పనులు షురూ కాలేదన్నారు. కోదాడ, హుజూర్నగర్ నియోజకవర్గాల్లో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తన సహచర మంత్రులతో కలిసి తిరగడం తప్ప అభివృద్ధి చేసింది ఏమీ లేదని విమర్శించారు.
కోదాడ నియోజకవర్గానికి పదేండ్లు ఉత్తమ్, ఐదేండ్ల పాటు ఆయన సతీమణి పద్మావతి చేసిన అభివృద్ధి శూన్యమని, వాళ్ల హయాంలో కోదాడ మురికి కూపంగా మారిందని తెలిపారు. కోదాడలో సెంట్రల్ లైటింగ్ సిస్టం, రోడ్డు వైడింగ్ పనులు తన హయాంలోనే జరిగాయన్నారు. రైతులు వరి పంట వేసేటప్పుడు సన్నాలకే బోనస్ అని వ్యవసాయ శాఖ అధికారులతో ఎందుకు వెల్లడించలేదని ప్రశ్నించారు. వరి ధాన్యానికి బోనస్ పేరు మీద ప్రభుత్వం రైతులను మోసం చేసిందన్నారు. ఆయకట్టు కింద పండిన ధాన్యాన్ని ఈ ప్రాంతంలో మిల్లర్లు ఉండబట్టి కొనుగోలు చేశారే తప్ప ప్రభుత్వం ఘనత ఏదీ లేదని చెప్పారు.
కౌలు రైతులను ప్రభుత్వం మోసం చేసిందని దుయ్యబట్టారు. యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ బీఆర్ఎస్ ప్రభుత్వంలో నిర్మిస్తే దాన్ని ప్రారంభించి తామే చేసినట్లు ముఖ్యమంత్రి, మంత్రులు చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు. గ్రామాల్లో అపరిశుభ్రత పెరిగిపోయిందని, గతంలో సర్పంచులు చేసిన పనులకు బిల్లులు చెల్లించడం లేదని అన్నారు. మంత్రులు హెలికాప్టర్లలో తిరుగుతూ ప్రజాధనాన్ని దుర్వినియో గం చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా కళ్లు తెరిచి తెచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో కోదాడ బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు నయీం, మండలాధ్యక్షులు నర్సిరెడ్డి, నాయకులు భట్టు శివాజీనాయక్, అనంతుల ఆంజనేయులు, శెట్టి సురేశ్‌నాయుడు, నాగిరెడ్డి, పిట్టల భాగ్యమ్మ, సుందర్‌బాబు, రాంబాబుగౌడ్, రాజేశ్, అప్పారావు, పూర్ణచంద్రరావు, రమేశ్, ఏడుకొండలు, యూత్ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ పాల్గొన్నారు.