కోదాడ, జూలై 26 : నాగార్జున సాగర్ డెడ్ స్టోరేజీకి చేరిన నేపథ్యంలో ఉమ్మడి నల్గొండ జిల్లాలోని రైతుల నార్లకు నీళ్లు లేవని, ఈ పరిస్థితిలో సాగర్ నుంచి తాగు నీటిని ఖమ్మం జిల్లా పాలేరుకు తరలించి మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి రైతుల నోట్లో మట్టి కొట్టారని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ధ్వజమెత్తారు. ఆదివారం మండలంలోని గణపవరం స్టేజీ వద్ద రైతులు నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. జూన్ 25న రోజుకు 4000 క్యూసెక్కుల నీటిని ఖమ్మానికి తరలిస్తుంటే మంత్రి నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ రైతులను దగా చేశారన్నారు. ఇప్పటికే సీతారామ ప్రాజెక్టు ద్వారా ఖమ్మం జిల్లా చెరువులకు పాలేరు లింకు ద్వారా నీరు చేరుతున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఉమ్మడి జిల్లాలో ఆయకట్టు చివరలో ఉన్న కోదాడలోని చెరువులకు నీటిని విడుదల చేయడంలో మంత్రి విఫలమయ్యారన్నారు. ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రి తుమ్మలకు ఉన్న సోయి ఉత్తమ్‌కు లేకపోవడం దురదృష్టకరమన్నారు. ఎత్తిపోతల పథకాలు, అభివృద్ధి పనుల్లో కమీషన్లు, కాంట్రాక్టులపై ఉన్న మమకారం రైతులపై లేకపోవడం దుర్మార్గమన్నారు. నియోజకవర్గ రైతులకు వారంలోగా తాగు, సాగునీరు అందించి చెరువులన్నింటినీ నింపాలని లేకుంటే ప్రజల పక్షాన తాను నిరాహార దీక్ష చేపట్టి, రైతులతో కలిసి ఉద్యమం చేపడతానని హెచ్చరించారు. గ్రామాల నాయకులు పొట్ట రణ్, జాబిశెట్టి చంద్రమౌళి, అంజిరెడ్డి, వేలాద్రితో పాటు వందలాది మంది రైతులు పాల్గొన్నారు.
నార్లకు నీళ్లు పెడదామంటే కరెంటు ఉండటం లేదు.. విద్యుత్ అధికారులు కూడా అందుబాటులో ఉండట్లేదు.. ఎప్పుడు కరెంటు వస్తుందో తెలియని దుస్థితి.. ఇక యూరియా కూడా సరఫరా కావడం లేదు.. ఈసారి పంటలు చేతికందే పరిస్థితి లేదు.. ఏం చేయాలో పాలు పోవడం లేదు.
-అంజిరెడ్డి, రైతు
కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు అన్ని రకాలుగా మోసపోయారు. కరెంటు లేదు. యూరియా లేదు.. రైతు భరోసా లేదు.. అధికారులు అందుబాటులో లేరు.. మమ్మల్ని పట్టించుకునే వారే లేరు.. కేసీఆర్ హయాంలో 24 గంటలు కరెంటు ఉండటంతో పంటలు బాగా పండాయి. తిరిగా ఆయన అధికారంలోకి వస్తేనే మాకు మేలు.
-వేలాద్రి, రైతు