కోదాడ, మే 29: దేశంలోనే అత్యధికంగా ధాన్యాన్ని అందించిన రాష్ట్రంగా తెలంగాణను నాటి సీఎం కేసీఆర్ నెంబర్ వన్ స్థానంలో నిలిపితే… నేడు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను వంచిందని, రేవంత్ సర్కార్‌ను గద్దె దించేందుకు ప్రజలు ఎదురు చూస్తున్నారని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ విమర్శించారు. శుక్రవారం ఆయన కోదాడలో మాట్లాడుతూ ఎన్నికల ముందు ప్రతి క్వింటాల్‌కు రూ.500 బోనస్ ఇస్తామని ఊదర గొట్టి.. అధికారంలోకి వచ్చాక సన్న వడ్లకే ఇస్తామని కొర్రీలు పెట్టి రైతులను మోసం చేస్తున్నారని ఆరోపించారు.
పక్క రాష్ట్రం కంటే రెండు బస్తాలు ఎక్కువ ధాన్యం కొనుగోలు చేశామని మంత్రి ఉత్తమ్‌కుమార్ చెప్పటం విడ్డూరంగా ఉందన్నారు. తరుగు పేరుతో రైతులను నిలువునా దోచుకుంటున్నారని అన్నారు. జూన్ 1లోగా కొనుగోలు ముగించాలని ప్రకటించడం దేనికి సంకేతమన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏడాదిలోనే 1.41 కోట్ల టన్నుల ధాన్యం సేకరించిన విషయాన్ని గుర్తుచేశారు. కేసీఆర్ హయాంలో ధాన్యం కొనుగోలు చేసి రైతుల ఖాతాల్లోకి రూ.26 వేల కోట్లు జమ చేశారని గుర్తు చేశారు.