‘ రెండు పర్యాయాలు సూర్యాపేట ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాం. కారు గుర్తుకు వేసిన ఓటు ఎన్నో అభివృద్ధి పనులు చేసి పెట్టింది. మరింత అభివృద్ధి కోసం మరోసారి ఆశీర్వదించండి.. మీ సేవకుడిగా పనిచేస్తా’ అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి, సూర్యాపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. అంత్యోదయ మహిళా పరస్పర సహకార పొదుపు సంఘం సమావేశం, సూర్యాపేట కార్పెంటర్స్ నూతన కార్యవర్గ పదవీ ప్రమాణ స్వీకారోత్సవానికి సోమవారం మంత్రి జగదీశ్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. యువతకు ఉపాధి కల్పనే లక్ష్యంగా రాబోయే పాలన ఉండబోతుందని, సూర్యాపేటలో పారిశ్రామిక హబ్ నెలకొల్పుతామని తెలిపారు. కాంగ్రెస్ మాయమాటలు నమ్మి మోసపోవద్దని, ఆ పార్టీ గెలుపొందడం అంటే తోడేళ్ల మంద గొర్రె పిల్లలపై పడడమేనని సూచించారు.
సూర్యాపేట టౌన్, నవంబర్ 6 : యువతకు ఉపాధి కల్పనే లక్ష్యంగా సూర్యాపేటలో రాబోయే పాలన ఉంటుందని విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. పట్టణంలోని కుడకుడలో అంత్యోదయ మహిళా పరస్పర సహకార పొదుపు సంఘం సర్వసభ్య సమావేశానికి, ది సూర్యాపేట కార్పెంటర్స్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవానికి సోమవారం ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రెండు పర్యాయాలు సూర్యాపేట ప్రజలకు చెప్పిన హామీలన్నీ నెరవేర్చామన్నారు.
ప్రజలు కారు గుర్తుకు వేసిన ఓటు సూర్యాపేటలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను తీసుకొచ్చిందన్నారు. పేటలో పారిశ్రామిక హబ్ నెలకొల్పడమే తన లక్ష్యమన్నారు. ఐటీ పరిశ్రమను 3వేలకు విస్తరించాలన్నది తన సంకల్పమని పేర్కొన్నారు. కాంగ్రెస్ మాటలు నమ్మి మోసపోవద్దని సూచించారు. కాంగ్రెస్ గెలవడమంటే తోడేళ్ల మంద గొర్రె పిల్లలపై పడడమేనని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇల్లు లేని వారు ఉండకూడదనేది సీఎం కేసీఆర్ లక్ష్యం కాగా సూర్యాపేట నియోజకవర్గంలో ఇల్లు లేని వారు ఉండకూడదనేది తన లక్ష్యమన్నారు. గత మ్యానిఫెస్టోను నూటికి నూరుశాతం అమలు చేసిన ఏకైక నాయకుడు సీఎం కేసీఆర్ అని కొనియాడారు.
బీఆర్ఎస్ పాలనలోనే మహిళా సంఘాల అభివృద్ధి జరిగిందన్న ఆయన పనిచేసే ప్రభుత్వానికి సబ్బండ వర్గాలు అండగా నిలబడాలని కోరారు. మరోసారి ఎమ్మెల్యేగా ఆశీర్వదిస్తే సేవకుడిగా పని చేస్తానన్నారు. ఇప్పటికే ఎంతో అభివృద్ధి చేశామని, మరోసారి గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తానని భరోసానిచ్చారు. సీఎం కేసీఆర్ రూపొందించిన ఎన్నికల మ్యానిఫెస్టో అద్భుతంగా ఉందన్నారు. మళ్లీ అధికారంలోకి రాగానే మహిళలకు సౌభాగ్యలక్ష్మి అందిస్తామని, రేషన్ ద్వారా సన్న బియ్యం సరఫరా చేస్తామని చెప్పారు. ప్రతిపక్ష నాయకుల మాటలు నమ్మి మోసపోవద్దని సూచించారు. కారు గుర్తుకు ఓటు వేసి తనను ఎమ్మెల్యేగా గెలిపించి కేసీఆర్‌ను ముఖ్యమంత్రిని చేయాలని కోరారు. అనంతరం సుమంగళి ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనానికి హాజరయ్యారు.