చౌటుప్పల్, ఫిబ్రవరి 12 : ఎస్సీ వర్గీకరణ విషయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నమ్మక ద్రోహం చేస్తున్నదని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ అన్నారు. ఆదివారం చౌటుప్పల్లోని వ్యవసాయ మార్కెట్ యార్డ్లో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్లమెంట్లో ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించి మాదిగ ఉపకులాలకు న్యాయం చేస్తానని మూడు దశాబ్దాలుగా బీజేపీ చెప్పుకొంటూ వచ్చిందన్నారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో బిల్లు పెడతామంటూ మాట ఇచ్చిందని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చి 9 ఏండ్లు గడుస్తున్నా బిల్లుపై ఎలాంటి స్పష్టత ఇవ్వడం లేదని మండిపడ్డారు. ఉభయ సభల్లో అనేక బిల్లులను ప్రవేశపెట్టి సంపూర్ణ మెజార్టీతో ఆమోదింపజేసుకున్న మోదీ సర్కారు ఎస్సీ వర్గీకరణ బిల్లును ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు.
అగ్ర కులాల కోసం విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించే విధంగా చట్టం చేసిన ప్రధాని మోదీ ఎస్సీ వర్గీకరణను ఎందుకు చేయడం లేదో కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వివరణ ఇవ్వాలన్నారు. బీజేపీ భరోసా యాత్ర చేసే బదులు ప్రజల నమ్మక ద్రోహ యాత్ర చేపడితే బాగుండేదన్నారు. ప్రధాని మోదీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ బీసీలై ఉండి కూడా బీసీలకు విద్య, ఉద్యోగాల్లో జనాభా ప్రాతిపదికన 50 శాతం రిజర్వేషన్లు అమలు చేయడం లేదన్నారు. మోదీ కేవలం అగ్రకులాల ప్రయోజనం కోసమే పనిచేస్తున్నారని విమర్శించారు.
బీజేపీ నమ్మక ద్రోహానికి నిరసనగా సోమవారం జాతీయ రహదారి దిగ్బంధనం చేపడుతున్నామని, మాదిగ ఉపకులాలు, రాజకీయ, ఉద్యోగ, ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్లు బండమీది మల్లేశం, కొరగోని లింగస్వామి, మాజీ సర్పంచ్ ఆల్మాస్పేట కృష్ణ్ణయ్య, ఎమ్మెస్పీ జిల్లా కన్వీనర్ నల్ల చంద్రస్వామి, ఎమ్మార్పీఎస్ మండల కన్వీనర్ బోయ లింగస్వామి, జీడిమెట్ల రవీందర్, ఊదరి శ్యామ్, ఊదరి వెంకటేశ్ మహాజన్, లింగస్వామి, పస్తం గంగారాములు, బోయ రాము, అరుట్ల లింగస్వామి, బోదుల నరేశ్ పాల్గొన్నారు.