యాదాద్రి భువనగిరి, ఏప్రిల్ 19 (నమస్తే తెలంగాణ) : భువనగిరి పార్లమెంట్‌కు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతున్నది. రెండో రోజు శుక్రవారం ఐదు నామినేషన్లు దాఖలయ్యాయి. యాదాద్రి భువనగిరి కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ఆర్వో కార్యాలయంలో ఆర్వో హన్మంతు కె.జెండగేకు అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలు సమర్పించారు.
బీజేపీ నుంచి బూర నర్సయ్యగౌడ్, సీపీఎం నుంచి మహ్మద్ జహంగీర్, సోషలిస్ట్‌పార్టీ(ఇండియా) అభ్యర్థి రచ్చ సుభద్రారెడ్డి ఒక సెట్, స్వతంత్ర అభ్యర్థులుగా మెగావత్ చందునాయక్, రేకల సైదులు వేర్వేరుగా ఒక్కో సెట్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ నెల 25 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. 26న నామినేషన్ల పరిశీలన, 29 వరకు నామపత్రాల ఉపసంహరణకు అవకాశం ఉంది.
బీజేపీ భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్ నామినేషన్ అఫిడవిట్లో తన ఆస్తులను ప్రకటించారు. ఆయనకు వ్యక్తిగతంగా రూ.27,59, 98,302 ఆస్తులు ఉన్నట్లు అఫిడవిట్లో చూపించారు. ఇందులో రూ.7,74,90,802 స్థిరాస్తులు, 19,85,07,500 చరాస్తులు ఉన్నాయి.
బ్యాంక్‌ల నుంచి రూ.1,28,17,844 లోన్ రూపంలో అప్పు తీసుకున్నారు. ఆయన భార్య పేరున రూ.1,45,60,147 చరాస్తులు, రూ.10,23, 76,250 స్థిరాస్తులు ఉన్నాయి. తనపై ఎలాంటి క్రిమినల్ కేసులు పెండింగ్ లేవని పేర్కొన్నారు. పలు రకాల లగ్జరీ కార్లు కలిగి ఉన్నట్లు చూపించారు.