నల్లగొండ జిల్లాలో ఫ్లోరైడ్ రక్కసిని శాశ్వతంగా రూపుమాపాలని శాస్త్రవేత్తలు సుదీర్ఘ కాలం చేసిన పరిశోధనను కేంద్రం నీరుగార్చింది. ఫ్లోరోసిస్ సమస్యకు మూలాలను అన్వేషించి దాన్ని అంతం చేసేందుకు ఎన్ఐఎన్ సహా దేశ, విదేశాల్లో ఎంతోమంది శాస్త్రవేత్తలు ఫ్లోరైడ్పై విస్తృత అధ్యయనం చేసి రూపొందించిన సమగ్ర కార్యాచరణ నివేదిక (డీపీఆర్)ను బుట్టదాఖలు చేసింది. ఫ్లోరైడ్ సమస్య నుంచి విముక్తి చేసే సంజీవనిలాంటి రీజినల్ ఫ్లోరైడ్ అండ్ ఫ్లోరోసిస్ రీసెర్చ్ సెంటర్‌ను బీజేపీ గద్దలా తన్నుకుపోయింది. చౌటుప్పల్‌కు రావాల్సిన ఫ్లోరోసిస్ రీసెర్చ్ సెంటర్‌ను జేపీ నడ్డా కోల్‌కతాకు తరలించారు. గతంలో నల్లగొండకు మరణశాసనం రాసిన జేపీ నడ్డా దారిలోనే మర్రిగూడ సభలో బండి సంజయ్ మోసపూరిత హామీలు గుప్పించాడు. నల్లగొండకు ద్రోహం చేసిన బీజేపీ నేతలు ఇప్పుడు మేలు చేస్తామంటూ మొసలికన్నీరు కారుస్తున్నారు. కానీ మునుగోడు ప్రజలు మోసం చేసినవారికి కర్రుకాల్చి వాత పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. మునుగోడు ఎన్నిక రూపంలో వచ్చిన అవకాశాన్ని బీజేపీకి ఓటు ద్వారా బుద్ధి చెప్పనున్నారు.
నల్లగొండ జిల్లాలో ఫ్లోరైడ్ రక్కసికి శాశ్వతంగా పరిష్కార మార్గాలను చూపేందుకు శాస్త్రవేత్తలు సుదీర్ఘ కాలం చేసిన పరిశోధనను కేంద్ర ప్రభుత్వం పరిహాసం చేసింది. ఉమ్మడి నల్లగొండను పట్టిపీడిస్తున్న ఫ్లోరోసిస్ సమస్యకు మూలాలను అన్వేషించి, దాన్ని రూపుమాపేందుకు ఎన్ఐఎన్ సహా దేశ, విదేశాల్లో ఫ్లోరైడ్పై విస్తృత అధ్యయనం చేసిన ఎంతోమంది శాస్త్రవేత్తలు రూపొందించిన సమగ్ర కార్యాచరణ నివేదిక (డీపీఆర్)ను బుట్టదాఖలు చేసింది. జాతీయ పోషకాహార సంస్థ డైరెక్టర్ (సైంటిస్ట్) డాక్టర్ అర్జున్ కందార్ (రిటైర్డ్) నేతృత్వంలోని బృందం యునిసెఫ్ (యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్ ఎమర్జెన్సీ ఫండ్) ఉమ్మడి నల్లగొండ ప్రజల ప్రధాన సమస్య ఫ్లోరోసిస్‌పై అధ్యయనం చేసింది. దేశంలోని 12 రాష్ర్టాల్లోని 125 ఫ్లోరైడ్ ప్రభావిత జిల్లాల్లో, నల్లగొండ జిల్లాలోనే ఫ్లోరైడ్ సమస్య అత్యంత తీవ్రంగా ఉన్నదని ఈ అధ్యయనంలో తేలింది. ఫ్లోరోసిస్ బాధితులు ఎక్కువగా ఉన్న ఉమ్మడి నల్లగొండ జిల్లాలో జాతీయ స్థాయి పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయాలని, ఈ కేంద్రంలో జరిగే పరిశోధనల ఫలితాలను దేశమంతా విస్తరించాలనే ఉద్దేశంతో డాక్టర్ అర్జున్ కందార్ బృందం సమగ్ర కార్యాచరణ నివేదిక రూపొందించింది. దీన్ని అమలు చేస్తే దాదాపు రూ.100 కోట్లు ఖర్చవుతాయని అంచనా కూడా వేసింది.
మళ్లీ అదే హామీ!
చౌటుప్పల్‌లో రీజినల్ ఫ్లోరైడ్ అండ్ ఫ్లోరోసిస్ రిసెర్చ్ అండ్ మిటిగేషన్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తామని అప్పటి కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, ప్రస్తుత బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా 2016 ఫిబ్రవరి 2న మర్రిగూడలో పర్యటించిన సందర్భంలో హామీ ఇచ్చారు. స్కెలెటన్ ఫ్లోరోసిస్ బాధితులు ఎక్కువగా ఉన్న మర్రిగూడలోనే 300 పడకల ఆస్పత్రిని ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు. అంతేకాదు.. ఫ్లోరైడ్ బాధితులకు ప్రభుత్వం సహాయం చేస్తుందని మాటిచ్చి, పైసా సాయం చేయలేదు. 300 పడకల దవాఖాన ఏర్పాటు పడకేసింది. పరిశోధనా కేంద్రం బెంగాల్‌కు పోయింది. ఇదే మునుగోడు ఎన్నికల్లో ‘మీ సమస్యలు పరిష్కరిస్తా’నంటూ అదే మర్రిగూడ మీదుగా వచ్చిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అంటున్నాడు. వాళ్ల జాతీయ అధ్యక్షుడు చెప్పినట్టే మళ్లీ చెబుతున్నాడు. ‘ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్నవాళ్లను ఎవరాపిన్రు. న్యాయం చేస్తామంటే మేమొద్దంటున్నామా?’ అని ఫ్లోరైడ్ విముక్తి పోరాట సమితి రాష్ట్ర కన్వీనర్ కంచుకట్ల సుభాష్ అంటున్నారు.
ఫ్లోరైడ్ సమస్య ఉన్న నల్లగొండలోనే ఉండాలని సూచించిన శాస్త్రవేత్తలు
ఫ్లోరైడ్ శాశ్వత పరిష్కారం కోసమే విస్తృత అధ్యయనం నల్లగొండలో ఫ్లోరైడ్ సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం ఎన్నో పరిశోధనలు చేశాం. యూనిసెఫ్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎన్ఐఎన్)తో కలిసి ఫ్లోరైడ్ సమస్యకు పరిష్కారం ఏమిటి? అనే అంశంపై శాస్త్రీయంగా అధ్యయనం చేశాం. దేశవ్యాప్తంగా ఫ్లోరైడ్ సమస్య పరిష్కారానికి విస్తృత పరిశోధన, అధ్యయనం కోసం ఒక సంస్థను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించాం. దానికి కావాల్సిన వసతులు, వనరులు కూడా తెలియజేశాం. కేంద్రం ఏర్పాటు చేయాలని ప్రతిపాదించాం. ఆ కేంద్రం నల్లగొండకే పరిమితం కాకుండా దేశానికి ఉపయోగపడేలా డీపీఆర్‌ను రూపొందించాం. ఇది అమలైతే నల్లగొండకే కాదు ప్రపంచ దేశాలన్నింటికీ ఫ్లోరోసిస్ బాధితులకు వైద్యం అందించడంలో మనమే ఆదర్శంగా నిలిచేవాళ్లం.
– డాక్టర్ అర్జున్ కందారే, సైంటిస్ట్ (రిటైర్డ్), ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్)
ఫ్లోరోసిస్‌కు సమస్యకు పరిశోధనే పరిష్కారం
ఫ్లోరోసిస్ బాధితులు తొందరగా అలసిపోతారు. కీళ్లనొప్పులు ఎక్కువ. ఎముకలు అసాధారణంగా పెరగడం, వంకర్లుపోవడంతో నాడులు ఒత్తుకుపోయే ప్రమాదముంది. స్పర్శ కోల్పోతారు. నాడీ సమస్యలు వస్తాయి. ఎముకలు బలహీనంగా ఉంటాయి. జీర్ణ కోశ సంబంధమైన సమస్యలూ ఉంటాయి. వీటికి ఇప్పటి వరకు ప్రత్యేకమైన వైద్య విధానాలేమీ లేవు. ఇతర రోగులకు ఇచ్చినట్లే మందులు ఇస్తున్నాం. పరిశోధనలు జరుగకపోవడంతో వారికి సరైనవైద్యం అందదు. ఎక్కువ కాలం మందులు వాడడంతో కిడ్నీలు ఫెయిల్ కావడం, అవయవాలు మందుల ప్రభావంతో క్షీణిస్తాయి. మిషన్ భగీరథతో కొత్తగా ఫ్లోరోసిస్ బారినపడే ప్రమాదం తప్పినా, ఇప్పటికే ఫ్లోరైడ్నీళ్లు తాగినవాళ్లకు వైద్య సేవలు అవసరం. ఇలాంటి వారి వైద్యానికి ఉపశనమనం కంటే నిర్మూలన వైపుగా చికిత్స చేస్తేనే ఎక్కువ ప్రయోజనాలుంటాయి. కానీ, ఇప్పటి వరకు అటువంటి పరిశోధన, వైద్య విధానాలు అభివృద్ధి జరగలేదు.
– డాక్టర్ పెరుమాళ్ల ప్రవీణ్ కుమార్, ఫ్లోరోసిస్ ప్రోగ్రామ్ ఆఫీసర్(ఎన్‌పీపీసీఎఫ్), నల్లగొండ జిల్లా
బీజేపీ సమాధానం చెప్పాలి
మమ్మల్ని గెలిపిస్తే ఈ సమస్యను అసెంబ్లీలో ప్రస్తావిస్తాం. ఫ్లోరైడ్ లేకుండా చేస్తామని హామీ ఇచ్చారు. నమ్మినోడల్లా నట్టేట ముంచాడు. యూపీఏ ప్రభుత్వం నల్లగొండ జిల్లా సమస్య పరిష్కారం కోసం రీజినల్ ఫ్లోరైడ్ అండ్ ఫ్లోరోసిస్ మిటిగేషన్ సెంటర్ మంజూరు చేస్తే, మోదీ ప్రభుత్వం బెంగాల్ ఎన్నికల రాజకీయాల కోసం దానిని ఇక్కడికి రాకుండా చేసింది. ఇప్పుడు ఎన్నికలొచ్చే సరికి మీ సమస్యలు పరిష్కరిస్తామని వాగ్దానం చేస్తున్నారు. మా సమస్య ఏమిటో వాళ్లకు అవగాహన లేదా? లేక సమస్యల నుంచి ఏమార్చడానికి వస్తున్నారా? బీజేపీ నల్లగొండకు చేసిన అన్యాయానికి ఇప్పుడు సమాధానం చెప్పాలి?
– కంచుకట్ల సుభాష్, ఫ్లోరోసిస్ విముక్తి పోరాట సమితి, రాష్ట్ర కన్వీనర్
పరిశోధనను నీరుగార్చిన కేంద్రం
జిల్లాలో ఉన్న లక్షలాది మంది ఫ్లోరోసిస్ బాధితులకు వైద్య సహాయంతోపాటు ఫ్లోరైడ్ నిర్మూలనకు అవకాశాలుంటాయనే ఉద్దేశంతో రీజినల్ ఫ్లోరైడ్ అండ్ ఫ్లోరోసిస్ మిటిగేషన్ సెంటర్ ఏర్పాటు కోసం కేంద్ర ప్రభుత్వానికి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చాలా కాలం ఉత్తర ప్రత్యుత్తరాలు నడిచాయి. చివరికి పరిశోధనా కేంద్రం ఏర్పాటుకు స్థల పరిశీలించాలని రాష్ట్ర ప్రభుత్వం 2013లో కలెక్టర్‌ను ఆదేశించింది. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం, హైదరాబాద్‌కు సమీపంలో ఉన్న చౌటుప్పల్‌లో దీనిని ఏర్పాటు చేయాలని అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత చౌటుప్పల్ మండలంలోని దండుమల్కాపురం రెవెన్యూ గ్రామంలోని సర్వే నెం.486లో 8.2 ఎకరాల స్థలాన్ని రీజినల్ ఫ్లోరైడ్ అండ్ ఫ్లోరోసిస్ మిటిగేషన్ సెంటర్ కోసం రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ఇందుకోసం రూ.వంద కోట్ల నిధులు కేంద్రం కేటాయించింది. ఈ దశలో బీజేపీ పెద్దలు జోక్యం చేసుకుని బెంగాల్ ఎన్నికల్లో రాజకీయ లబ్ధి కోసం పరిశోధనా కేంద్రాన్ని కోల్‌కత్తాకు బదిలీ చేశారు. మొగున్ని కొట్టి మొగసాలకెక్కిన చందంగా బీజేపీ సర్కారు ఉన్నది.