– బీఆర్ఎస్లో చేరిన జిల్లపల్లి గ్రామ కాంగ్రెస్ నాయకులు
– గులాబీ కండువాలు కప్పి ఆహ్వానించిన మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్
దేవరకొండ రూరల్, డిసెంబర్ 05 : దేవరకొండ మండలంలో కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. మండలంలోని జల్లిపల్లి గ్రామ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు 80 మంది ఆ పార్టీని వీడి శుక్రవారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. దేవరకొండ పట్టణంలోని పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో వీరందరికి బీఆర్ఎస్ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ గులాబీ కండువాలు కప్పి సాధరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ పార్టీని తుక్కుతుక్కుగా ఓడిస్తేనే పథకాలు అమలు అవుతాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండేళ్లయింది. ఎన్నికల ముందు గ్యారెంటీ కార్డులు పంచి బాండ్ పేపర్ రాసిచ్చారు. కానీ ఇప్పటికీ రెండు సంవత్సరాలయింది ఒక్క హామీ కూడా అమలు చేయలేదని ఆయన దుయ్యబట్టారు.
రూ.200 పెన్షన్ రూ.2 వేలు చేసింది, ఇంటింటికి మంచినీళ్లు అందించింది, రూ.10 వేల రైతు బంధు ఇచ్చింది కేసీఆర్ అని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. కేసీఆర్ కిట్టు పెట్టి రూ.13 వేలు కాన్పుకి ఇచ్చింది, పిల్లల చదువుల కోసం వెయ్యి గురుకుల పాఠశాలను ఏర్పాటు చేసింది కేసీఆర్ అని కొనియాడారు. కేసీఆర్ చెప్పినవి చేసిండు చెప్పనివి కూడా చేసిండన్నారు. అదే రేవంత్ రెడ్డి రూ.2 వేల పెన్షన్ రూ.4 వేలు చేస్తానని చెప్పిండు మరి అది ఏమైందని ఆయన ప్రశ్నించారు. బతుకమ్మకు రెండు చీరలు ఇస్తానన్న రేవంత్ రెడ్డి బతుకమ్మకు చీరలకు ఎగ్గొట్టిండు. ఓటు కోసం ఒక చీర పంపిండు అది కూడా కొందరికే అన్నారు. రూ.60 వేల రూపాయలు ప్రతి అక్కకు, చెల్లెకు బాకీపడ్డాడు రేవంత్ రెడ్డి అన్నారు.
కల్యాణ లక్ష్మి లేదు. తులం బంగారం అంతకంటే లేదు. అరచేతిలో వైకుంఠం చూపించి ఆగమాగం చేసిండని అన్నారు. మహిళలకు ఫ్రీ బస్సు, పురుషులకు డబుల్ టికెట్. ఇది మోసం కాకపోతే ఏమిటని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలనలో కనీసం ఊర్లలో ట్రాక్టర్లలో డీజిల్ కి డబ్బులు లేవు. వీధిదీపాలకు బల్బులు లేవు.. కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగా ఉండే అని అందరూ యాది చేసుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సంకూ కొండల్ రెడ్డి, శైలేందర్ రెడ్డి, వెంకటయ్య పాల్గొన్నారు.