మిర్యాలగూడ, సెప్టెంబర్ 18 : నల్లగొండ జిల్లాను బంగారు కొండగా మారుస్తామని, ఏడాది కాలంలోనే మిర్యాలగూడ నియోజకవర్గం రూపురేఖలను మార్చి చూపిస్తామని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. బుధవారం మిర్యాలగూడ పట్టణంలోని వై జంక్షన్ వద్ద రూ.180కోట్లతో చేపట్టిన నాలుగు ఫ్లైవర్ బ్రిడ్జి నిర్మాణ పనులను ఎంపీ రఘువీర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు బత్తుల లక్ష్మారెడ్డి, కుందూరు జైవీర్రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ నల్లగొండ జిల్లాలోని అన్ని గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పించడంతోపాటు లింకు రోడ్లను డబుల్ రోడ్లుగా మారుస్తామన్నారు. జిల్లాలో మొదటి విడతలోనే రూ.550 కోట్లతో రోడ్ల నిర్మాణం చేపట్టినట్లు చెప్పారు. రోడ్లు, రవాణాకు ప్రాధాన్యం ఇస్తున్నామని, తన దృష్టికి వచ్చిన వెంటనే నిధులను మంజూరు చేస్తున్నానని తెలిపారు. మాడ్గులపల్లి మండల కేంద్రం నుంచి దామరచర్ల వరకు సర్వీస్ రోడ్డు పనులను పది, పదిహేను రోజుల్లో ప్రారంభించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
మిర్యాలగూడ పట్టణంలో స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు రూ.10కోట్లను మంజూరు చేయించడం జరిగిందని తెలిపారు. మిర్యాలగూడలో రూ.320 కోట్లతో అమృత్ స్కీమ్ కింద ఎస్టీపీ, మంచినీటి పైపులైన్ నిర్మాణాలను చేపడుతున్నట్లు చెప్పారు. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌లో ఈ డిసెంబర్ నాటికి మూడో యూనిట్‌ను ప్రారంభిస్తామని, వచ్చే ఏడాది మార్చి 31 నాటికి 4వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తామని పేర్కొన్నారు. 43 కిలోమీటర్లు పొడవు ఉన్న శ్రీశైలం సొరంగమార్గం పనులను త్వరలో పూర్తి చేసి 4 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు. తద్వారా నల్లగొండ, నాగార్జునసాగర్, దేవరకొండ నియోజకవర్గాలు సస్యశ్యామలం అవుతాయన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మహబూబాబాద్, ఖమ్మం జిల్లాలోని వరదలకు గురైన వారి కోసం మిర్యాలగూడ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ వారు 30 టన్నుల బియ్యాన్ని మంత్రి చేతుల మీదుగా అందజేశారు. అనంతరం క్లియో స్పోర్ట్స్ మైదానంలో జరిగిన గురుపూజోత్సవంలో మంత్రి పాల్గొని ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలను సన్మానించారు. కార్యక్రమంలో కలెక్టర్ సి.నారాయణరెడ్డి, సబ్ కలెక్టర్ అమిత్నారాయణ్, ఇంజనీరింగ్ చీఫ్ మధుసూదన్‌రెడ్డి, ఆర్అండ్బీ ఎస్ఈ సత్యనారాయణరెడ్డి, నల్లగొండ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు కేతావత్ శంకర్‌నాయక్, కాంగ్రెస్ పట్టణాధ్యక్షుడు నూకల వేణుగోపాల్‌రెడ్డి పాల్గొన్నారు.