తుంగతుర్తి, మే 16 : ఏరియా ఆస్పత్రికి వచ్చే రోగుల పట్ల వైద్య సిబ్బంది మానవత్వంతో ఆదరిస్తూ, ఓర్పుతో మెరుగైన వైద్య సేవలు అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తుంగతుర్తి జూనియర్ కోర్టు సివిల్ జడ్జి ఎండీ గౌస్ పాషా అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని ఏరియా ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన మండల న్యాయ సేవాధికర సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. వైద్య సేవల కోసం వచ్చే రోగులకు ఆరోగ్యం పట్ల తీసుకోవాల్సిన సలహాలు, సూచనలను వివరించాలన్నారు. రోగుల వివరాలను గోప్యంగా ఉంచాలని, వారి మానవ విలువలకు భంగం కలిగించే విధంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవన్నారు.
వైద్య సేవలు అందించే సమయంలో ఎవరైనా విధులకు ఆటంకం కలిగిస్తే చట్టాలు ఉన్నాయని, వైద్య సిబ్బందికి ఎలాంటి సమస్యలు ఎదురైనా తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తామని తెలిపారు. అంతకుముందు ఆస్పత్రిలోని ఓపీ రిజిస్టర్ పరిశీలించి, గదులను కలియ తిరుగుతూ మందులు, పరీక్ష ల్యాబ్ ను పరిశీలించి స్వయంగా రోగులతో మాట్లాడుతూ అందుతున్న వైద్య సేవల గురించి జడ్జీ అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నిర్మల్ కుమార్, తుంగతుర్తి ఇన్చార్జి సీఐ నాగేశ్వరరావు, ఎస్ఐ క్రాంతి కుమార్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అనేపర్తి జ్ఞాన సుందర్, న్యాయవాదులు, సీనియర్ సిస్టర్ నాగమణి, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.