సూర్యాపేట టౌన్, మార్చి 10 : కంప్యూటర్ పరిజ్ఞానంతో మెరుగైన జీవితం పెంపొందించుకోవచ్చని మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. బ్రైట్ చైల్డ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన కంప్యూటర్ ల్యాబ్‌ను ఆయన సందర్శించారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. మనం జీవితంలో ఏది సాధించాలన్నా పాఠశాలలోనే పునాదులు పడుతాయన్నారు. ప్రపంచంతో పోటీ పడాలంటే తప్పకుండా ఇంగ్లీష్, కంప్యూటర్ జ్ఞానం ఉండాలన్నారు. అలా అని అమ్మ భాషను మర్చిపోవద్దని సూచించారు. పరాయి భాష అవసరం కాబట్టి నేర్చుకోవాలన్నారు.
చాలామంది ఎదుగుదలలో తల్లిదండ్రుల పాత్రతో పాటు సమాజం పాత్ర ఎంతో ఉంటుందన్నారు. ప్రభుత్వాలు చేయలేని పనులను స్వచ్ఛంద సేవా సంస్థలు చేస్తున్నట్లు చెప్పారు. ఫౌండేషన్లు అందిస్తున్న సేవా కార్యక్రమాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకొని జీవితంలో రాణించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు గోలి పద్మ, ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు.