నిడమనూరు, జూలై 17 : వరికి ప్రత్యామ్నాయంగా రైతులు ఆయిల్‌పామ్ పంటను సాగు చేసి మెరుగైన ఆదాయం పొందాలని నల్లగొండ జిల్లా ఉద్యానవన, పట్టు పరిశ్రమ శాఖ అధికారి పిన్నపురెడ్డి అనంతరెడ్డి అన్నారు. గురువారం నిడమనూరు మండల పరిధిలోని వేంపాడు గ్రామ శివారులో ఏమిరెడ్డి లక్ష్మమ్మ వేణుధర్రెడ్డికి చెందిన 11.5 ఎకరాల వ్యవసాయ క్షేత్రంలో మెగా ఆయిల్‌పామ్ ప్లాంటేషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వాణిజ్య పంటగా ప్రసిద్ధి చెందిన ఆయిల్‌పామ్ సాగు ద్వారా అధిక దిగుబడితో పాటు వరి పంట కంటే రూ.లక్షన్నర వరకు ఆదాయం గడించవచ్చన్నారు. ఆయిల్ పామ్ మొక్కను ఒకసారి నాటితే నాల్గొవ ఏడాది నుండి నిర్విరామంగా 30 సంవత్సరాల వరకు సరాసరిన 10 నుంచి 12 టన్నుల దిగుబడి తీసుకోవచ్చని వివరించారు.
ప్రకృతి వైపరీత్యాలు, చీడపీడలను తట్టుకునే ఆయిల్‌పామ్ సాగును రైతులు చేపట్టాలని సూచించారు. ఆయిల్‌పామ్ సాగును ప్రోత్సహించేందుకు నూరు శాతం రాయితీపై మొక్కలను ప్రభుత్వం అందిస్తుందని, డ్రిప్ పరికరాలకు సైతం రాయితీని కల్పిస్తుందన్నారు. సాంప్రదాయ పంటల నుండి ఆయిల్‌పామ్, ఉద్యాన పంటల సాగును చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో నిడమనూరు ఉద్యానవన అధికారి జి.రిషిత, ఆయిల్‌పామ్ కంపెనీ ప్రతినిధులు భరత్‌కుమార్, ప్రసాద్, రాంప్రసాద్, సతీశ్, కోటేశ్, డ్రిప్ కంపెనీ ప్రతినిధులు సురుగురు రాజశేఖర్‌రెడ్డి, రైతులు పాల్గొన్నారు.