కొండమల్లేపల్లి, ఏప్రిల్ 7 : ప్రభుత్వం హడావుడిగా చేసిన సన్నబియ్యం పంపిణీ ప్రారంభాలకే తప్ప ప్రజలకు అందజేయడంలో వెనుకంజ వేసిందని లబ్ధిదారులు విమర్శిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉగాది పండుగ నుంచి రేషన్ షాపుల్లో సన్న బియ్యం పంపిణీ చేపట్టింది. కానీ కొండమల్లేపల్లి మండల కేంద్రంతోపాటు ఆయా గ్రామాల్లోని రేషన్ షాపుల్లో సన్నబియ్యం లేక అబ్ధిదారులు వెనుదిరిగిపోతున్నారు.
ఒక్కో రేషన్ దుకాణానికి దాదాపు 40 నుంచి 50 క్వింటాళ్ల వరకు రావాల్సి ఉండగా 20 క్వింటాళ్లు మాత్రమే వచ్చాయి. దాంతో ఒకటి, రెండు రోజులకే బియ్యం అయిపోయాయని రేషన్ డీలర్లు సమాధానం చెబుతున్నారు. స్టాక్ విషయం తెలియని లబ్ధిదారులు రేషన్ షాపుల వద్దకు వచ్చి ఇబ్బంది పడుతున్నారు.
రైతుబంధు, రుణమాఫీ మాదిరిగా సగం మందికి మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకుంటారా అని జనం అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై సివిల్ సప్లయ్ అధికారి హన్మంత్ శ్రీనివాస్‌గౌడ్‌ను వివరణ కోరగా ఉగాదికి ప్రారంభం కావాలనే ఉద్దేశంతో రేషన్ షాపులకు తొలుత 50 శాతం సన్న బియ్యం పంపిణీ చేశామని, త్వరలో మిగతా 50 శాతం పంపిణీ చేస్తామని తెలిపారు.