నీలగిరి, నవంబర్ 12 : అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు నాణ్యమైన పౌష్టికాహారాన్ని అందించాలని నల్లగొండ సీడీపీఓ తూముల నిర్మల అన్నారు. బుధవారం నల్లగొండ పట్టణంలోని రామకృష్ణానగర్ అంగన్వాడీ కేంద్రాల్లో ప్రత్యేక పౌష్టికాహారం ఎగ్ బిర్యానీని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె లబ్ధిదారుల నుండి పౌష్టికాహారం అందుతుందా అనే విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పౌష్టికాహార లోపాన్ని అధిగమించేందుకు ప్రభుత్వం ప్రతి రోజు ఆరోగ్య లక్ష్మితో పాటు బుధవారం నాడు ఎగ్ బిర్యానీని కూడా అందిస్తుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ అంగన్వాడీ కేంద్రాల ద్వారా వచ్చే పౌష్టికాహారాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పౌష్టికాహారం పక్కదారి పడితే ఏ మాత్రం సహించేది లేదని, నాసిరకంగా అందించినా కూడా తగిన చర్యలు ఉంటాయని ఆమె హెచ్చరించారు. అనంతరం శిశు విక్రయాలు, బాల్య వివాహాలపై ఆమె అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ పల్లా సరిత, జ్యోతి, శ్రావణి, ఆశ్రిత, సంతోష, సుష్మ, ఆయా మంగమ్మ పాల్గొన్నారు.

Nilagiri : లబ్ధిదారులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించాలి : సీడీపీఓ తూముల నిర్మల