మిర్యాలగూడ, మే 5 : గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లను కేటాయించాలని డిమాండ్ చేస్తూ లబ్ధిదారులు ఆందోళనకు దిగారు. గతంలోనే డ్రా తీసి లబ్ధిదారులను గుర్తించినా ఇప్పటికీ ఇండ్లు అప్పగించకపోవడంతో అన్యాయమంటూ మిర్యాలగూడ సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట సోమవారం ధర్నా చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ డ్రా పద్ధతిలో లబ్ధిదారులను గుర్తించి రెండేండ్లు కావస్తున్నా ఇంతవరకు ఇండ్లు కేటాయించడం ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా అద్దె ఇండ్లలో ఉంటూ ఆర్ధిక ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. పట్టణంలో 566 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు సిద్ధంగా ఉన్నప్పటికీ కేటాయించకపోవడంలో ఆంతర్యమేంటని ప్రశ్నించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం తమ పేర్లను తొలగించి వేరే వారిని ఎంపిక చేసే ప్రయత్నం చేస్తున్నదని ఆరోపించారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో లబ్ధిదారులు నాజర్వలీ, నస్రీన్, రేష్మా, రెహానా, బుహ్రాన్, రహీమున్నీసా పాల్గొన్నారు.