చండూరు, జులై 09 : కార్మికులకు నష్టం కలిగించే నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని, కార్మికుల హక్కుల జోలికొస్తే ఖబర్దార్ మోదీ అని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు చిన్నపాక లక్ష్మీనారాయణ అన్నారు. బుధవారం నల్లగొండ జిల్లా చండూరు మండల కేంద్రంలో అఖిల భారత సార్వత్రిక సమ్మెలో భాగంగా సీఐటీయూ, బీఆర్టీయూ ఆధ్వర్యంలో చండూర్ మార్కెట్ యార్డ్ నుండి చండూరు చౌరస్తా వరకు ర్యాలీ తీసి రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు.
ప్రజల కష్టార్జితంతో నిర్మించుకున్న ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్, కార్పొరేట్ శక్తులకు అప్పచెప్పవద్దన్నారు. కార్మికులు 10 గంటలు పని చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం జీఓ జారీ చేయడంపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పి కొట్టేందుకు, భారత రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను కాపాడుకునేందుకు పోరాటాలు నిర్వహించాలని కార్మికులకు ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. బీఆర్టీయూ చండూర్ పట్టణాధ్యక్షుడు చొప్పరి దశరథ మాట్లాడుతూ.. కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలన్నారు.
ఈ కార్యక్రమంలో సీఐటీయూ చండూరు మండల కన్వీనర్ జెర్రిపోతుల ధనంజయ, సీనియర్ నాయకులు మోగుదాల వెంకటేశం, చిట్టిమల్ల లింగయ్య, గ్రామ పంచాయతీ యూనియన్ మండల ప్రధాన కార్యదర్శి నాంపల్లి శంకర్, పుష్పలత, నాగిల్ల లక్ష్మయ్య, కృష్ణయ్య, యాదయ్య, భిక్షమయ్య, మున్సిపల్ యూనియన్ జిల్లా నాయకులు కత్తుల సైదులు, బిపంగి నాగరాజు, ఇరిగి యాదగిరి, నల్లగంటి లింగస్వామి, కళమ్మ, రేణుక, ఆశా వర్కర్స్ యూనియన్ నాయకులు కట్ట పద్మ, నాగమణి, వీఓఏల చండూరు మండల అధ్యక్షుడు యాదయ్య, హాల్యా, హమాలీ యూనియన్ అధ్యక్షులు సాయం కృష్ణయ్య, నాగరాజు, నాగేశ్, బీఆర్టీయూ నాయకులు మల్లేశం, వెంకటేశం, జిట్టగోని యాదయ్య, శేఖర్ రెడ్డి, పరమేశ్, యాదయ్య, కల్లుగీత కార్మిక సంఘం నాయకులు నకరికంటి భిక్షమయ్య, టి.యాదయ్య, అంజయ్య, ఏ.రాములు, నక్కపోతు లింగయ్య పాల్గొన్నారు.