నిడమనూరు, నవంబర్ 24 : కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేస్తామన్న హామీ అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు మొండి చేయి చూపిందని బీఆర్ఎస్ నిడమనూరు మండల అధ్యక్షుడు తాటి సత్యపాల్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన వెంటనే 42 శాతం రేజర్వేషన్లు, బడ్జెట్లో రూ.20 వేల కోట్లు కేటాయిస్తామన్న హామీని కాంగ్రెస్ ప్రభుత్వం తుంగలో తొక్కిందని దుయ్యబట్టారు. రేజర్వేషన్ల అమలు వంటి బూటకపు హామీతో బీసీల ఓట్లు దండుకుని గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీకి పంచాయితీ ఎన్నికల్లో గుణపాఠం చెప్పి తీరాలని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. ప్రజా వ్యతిరేక విధానాలతో నయవంచన చేసిన ప్రభుత్వం మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. ఈ సమావేశంలో నాయకులు పిల్లి రాజు యాదవ్, కేశబోయిన శంకర్, మార్కెట్ మాజీ వైస్ చైర్మన్ మెరుగు రామలింగయ్య పాల్గొన్నారు.