యాదగిరిగుట్ట, ఫిబ్రవరి23 : బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదని, కుట్రపూరితంగా కులగణన అంటూ సీఎం రేవంత్‌రెడ్డి మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు బూడిద భిక్షమయ్యగౌడ్ అన్నారు. ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. బీసీ కుల గణనలో ఎక్కడ తప్పు జరిగిందో చెప్పాలని సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యాలను ఆయన తీవ్రంగా ఖండించారు. సర్వే చేయిస్తాం.. 42 శాతం బీసీలకు రిజర్వేషన్ ఇస్తామని మాట ఇచ్చింది నువ్వే కదా అని పశ్నించారు. కులగణన చేసింది సైతం నువ్వేనని తప్పు ఎక్కడ జరిగిందో తెలుసుకోలేని అసమర్థ పాలన సాగిస్తున్న రేవంత్‌రెడ్డిని బీసీలు క్షమించరని పేర్కొన్నారు.
సర్వేలో సూచించిన 56 ప్రశ్నలే నువ్వు చేసిన మొదటి తప్పని అన్నారు. కులగణనకు అడ్డంకిగా 56 ప్రశ్నలు మారుతాయని సీఎం రేవంత్‌రెడ్డి ముందే తెలుసునని, తప్పు ఎలా జరిగిందో రేవంత్ తన సొంత గ్రామమైన కొండారెడ్డిపల్లిలో ప్రజలకు అడిగితే తెలుస్తుందని తెలిపారు. రాష్ట్రంలో ఒక్క గ్రామంలో సైతం నిజాయితీగా కులగణన సర్వే జరుగలేదని, చిత్తశుద్ధి ఉంటే కులగణన సర్వేపై అఖిలపక్షం నాయకులతో ప్రత్యేక కమిటీని వేసి సర్వే చేయాలని సూచించారు. రేవంత్ మాట ప్రకారం బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తుందని, వెంటనే సమగ్ర కులగణన సర్వే చేయించి బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని, ఆ తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని డిమాండ్ చేశారు. లేకపోతే బీసీలంతా ఏకమై కాంగ్రెస్ పార్టీ బొదపెట్టడం ఖాయమని తెలిపారు.