పెర్త్ : ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న భారత మహిళల జట్టు.. కంగారూలతో జరుగుతున్న ఏకైక టెస్టులోనూ తడబడింది. బ్యాటింగ్ వైఫల్యం కారణంగా వన్డేల్లో ఆసీస్ చేతిలో క్లీన్‌స్వీప్ అయిన హర్మన్‌ప్రీత్ కౌర్ సేన.. పెర్త్ వేదికగా శుక్రవారం నుంచి మొదలైన టెస్టులోనూ అదే ఆటతీరును ప్రదర్శించింది. ఒకేరోజు 13 వికెట్లు నేలకూలిన పిచ్‌పై ఆసీస్‌దే పైచేయి అయింది. ఆతిథ్య జట్టు ఆహ్వానం మేరకు మొదట బ్యాటింగ్‌కు వచ్చిన ఉమెన్ ఇన్ బ్లూ.. తొలి ఇన్నింగ్స్‌లో 62.4 ఓవర్లలో 198 పరుగులకు ఆలౌట్ అయింది.
జెమీమా రోడ్రిగ్స్ (52) మాత్రమే అర్ధ శతకం సాధించగా షెఫాలీ వర్మ (35), కాశ్వీ గౌతమ్ (34*) ఫర్వాలేదనిపించారు. స్మృతి మంధాన (4), హర్మన్‌ప్రీత్ (18), ప్రతీక (18, దీప్తి (7), రిచా (11) దారుణంగా విఫలమయ్యారు. ఆసీస్ బౌలర్లలో అన్నాబెల్ సదర్లండ్ (4/46), లుసి హమిల్టన్ (3/31), డార్సీ బ్రౌన్ (2/41) భారత బ్యాటర్ల పనిపట్టారు. భారత ఇన్నింగ్స్‌లో ఏ ఇద్దరి మధ్యా కనీసం 50 పరుగుల భాగస్వామ్యం నమోదుకాలేదు.
భారత్‌ను తక్కువ స్కోరుకే పరిమితం చేసి ఫస్ట్ ఇన్నింగ్స్‌కు వచ్చిన ఆస్ట్రేలియా మొదటి రోజు ఆట ముగిసే సమయానికి 27 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 96 రన్స్ చేసింది. ఎల్లీస్ పెర్రీ (62 బంతుల్లో 43 నాటౌట్, 7 ఫోర్లు), అన్నాబెల్ (29 బంతుల్లో 20 నాటౌట్) క్రీజులో ఉన్నారు. జార్జియా వోల్ (2), లిచ్‌ఫీల్డ్ (9) తక్కువ స్కోరుకే ఔట్ అవగా తన కెరీర్లో ఆఖరి మ్యాచ్ ఆడుతున్న కెప్టెన్ అలిస్సా హీలి (13) విఫలమైంది. పెర్రీ, అన్నాబెల్ ఆ జట్టును ఆదుకున్నారు. ఈ జోడీ నాలుగో వికెట్‌కు 38 రన్స్ జోడించి మరో వికెట్ పడకుండా జాగ్రత్తపడింది. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో ఆసీస్ ఇంకా 102 పరుగులు వెనుకబడి ఉంది. భారత బౌలర్లలో సయాలి సత్గరె (2/24) రెండు వికెట్లు పడగొట్టింది.