మిర్యాలగూడ టౌన్, జనవరి 19 : గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు అన్యాయం చేసిన రాష్ట్ర ప్రభుత్వం, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లోనూ 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయకుండా మోసం చేసిందని బీసీ జేఏసీ మిర్యాలగూడ పట్టణాధ్యక్షుడు బంటు వెంకటేశ్వర్లు ముదిరాజ్ అన్నారు. ప్రభుత్వ చర్యను నిరసిస్తూ సోమవారం మిర్యాలగూడ పట్టణంలోని మహాత్మా జ్యోతిరావ్ పూలే విగ్రహం వద్ద వద్ద బీసీ జేఏసీ ఆధ్వర్యంలో కళ్లకు నల్ల గంతలు కట్టుకుని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీసీలను అన్ని పార్టీలు మోసం చేస్తూనే ఉన్నాయన్నారు. జనాభాలో సగానికి పైగా ఉన్న బీసీలు రాజకీయంగా, ఆర్థికంగా ఎంతో వెనుకబడి ఉన్నట్లు తెలిపారు. రాజకీయ పార్టీలు బీసీలను వాడుకుని వదిలేస్తున్నాయన్నారు. బీసీలకు విద్యా, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ, సామాజిక రంగాల్లో 42 శాతం రిజర్వేషన్లు సాధించే దిశగా పెద్ద ఎత్తున ఉద్యమించనున్నట్లు చెప్పారు.
కావునా ఇప్పటికైనా బీసీలంతా పెద్ద ఎత్తున పార్టీలకు అతీతంగా జనరల్ స్థానాల్లో ఎన్నికల బరిలో దిగాలన్నారు. బీసీల ఓట్లు బీసీలకు వేసుకుని జనాభా దామాషా ప్రకారం మనమెంతో మనకంత వాటా సాధించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ జేఏసీ మిర్యాలగూడ నియోజవర్గ అధ్యక్షుడు గుండెబోయిన నాగేశ్వరావు యాదవ్, బీసీ సంక్షేమ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు యర్రబెల్లి దుర్గయ్య రజక, బీసీ యువజన సంఘం పట్టణ కార్యదర్శి దోనేటి శేఖర్ ముదిరాజ్, కె.కోటయ్య, ఎం.వెంకన్న, బలరాం, సోయల్, శివయ్య, కిరణ్, కిషన్, విజయ్, సతీష్, శ్రీకాంత్, కృష్ణ, శివయ్య, జాంగిర్, సత్యం, శ్రీనివాస్, వెంకటేశం పాల్గొన్నారు.