న్యూఢిల్లీ: భారతీయ సైన్యాధికారులు ముగ్గురు తృటిలో ప్రాణాలతో బయటపడ్డారు. ఆ ముగ్గురూ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ .. లడాఖ్‌లోని లేహ్ ప్రాంతంలో కూలింది. తంగ్సే ప్రాంతంలో కూలిన ఆ హెలికాప్టర్(Chopper Crash) ఘటన గురించి నిజాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. చీతా ఫ్లీట్‌కు చెందిన ఆ చాపర్… మే 20వ తేదీన కూలినట్లు తెలుస్తోంది. కానీ అధికారులు ఇవాళ ఆ విషయాన్ని కన్ఫర్మ్ చేశారు. కూలిన చాపర్‌లో లెఫ్టినెంట్ కల్నల్, మేజర్, మేజర్ జనరల్ ఉన్నారు. సింగిల్ ఇంజిన్ చాపర్‌కు లెఫ్టినెంట్ కల్నల్‌తో పాటు ఓ మేజర్ పైలెట్‌గా ఉన్నారు.
3వ ఇన్ఫాంట్రీ డివిజన్‌కు చెందిన మేజర్ జనరల్ సచిన్ మెహతా కూడా ఆ చాపర్‌లో ఉన్నారు. ముగ్గురికీ గాయాలు అయినట్లు అధికారులు వెల్లడించారు. అయితే మేజర్ జనరల్ మెహతా.. కూలిన చాపర్ వద్ద ఓ సెల్ఫీ దిగారు. ఆ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కొండమీద రాళ్ల మధ్య .. కూలిన చాపర్ వద్ద కూర్చున్న ఫోటో షేర్ అవుతోంది. ప్రాణాలతో బయటపడడం ఓ మెరాకిల్గా భావిస్తున్నారు.
పర్వత శ్రేణుల్లో భిన్నమైన వాతావరణం ఉంటుంది, అలాంటి వెదర్లో వయసు మళ్లిన చీతా చాపర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటన పట్ల అధికారిక దర్యాప్తునకు ఆదేశించారు. 1970 దశకంలో తొలిసారి చీతా హెలికాప్టర్లను వినియోగించారు. 1984లో చేపట్టిన ఆపరేషన్ మేఘదూత్ కోసం ఈ హెలికాప్టర్లను వాడారు. సియాచిన్ గ్లేసియర్ వద్ద పాకిస్థానీ సైనికులను ఈ చాపర్లతో ఎదుర్కొన్నారు.
అయితే గతంలోనూ పలు సందర్భాల్లో చీతా చాపర్లు నేలకూలాయి. అనేక మంది పైలెట్లు ప్రాణాలు కోల్పోయారు. చీతా హెలికాప్టర్లో అయిదుగురు ప్రయాణించవచ్చు. హై ఆల్టిట్యూడ్ ఫ్లయింగ్ చాపర్స్‌లో దీనికి ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకత ఉన్నది.