సూర్యాపేట, జూలై 28 (నమస్తే తెలంగాణ) : రైతుల నుంచి ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యాన్ని సీఎమ్మార్ (కస్టం మిల్లింగ్ రైస్) కోసం మిల్లులకు కేటాయిస్తే కొంత మంది మిల్లర్లు వాటిని తెగనమ్ముకొని రూ.కోట్లు వెనకేసుకుంటున్నారు. ఐదు రోజుల్లో విజిలెన్స్‌తో పాటు స్థానిక సివిల్ సైప్లె అధికారులు ఆరు మిల్లులను తనిఖీ చేస్తే దాదాపు రూ.140 కోట్ల విలువైన ధాన్యం మాయమైనట్లు గుర్తించారు. దీంతో అక్రమాలకు పాల్పడిన మిల్లులపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు.
అక్రమాలకు పాల్పడిన వారిలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ జనరల్ సెక్రటరీ వట్టె జానయ్య యాదవ్‌కు చెందిన మిల్లులో రూ.70 కోట్ల విలువ చేసే ధాన్యం మాయం కావడం గమనార్హం. అధికారులు జిల్లా వ్యాప్తంగా అన్ని మిల్లులను తనిఖీ చేస్తే 70శాతం మిల్లుల్లో ధాన్యం పక్కదారి పట్టినట్లు తేలుతుందని నాలుగు దశాబ్దాలుగా వ్యాపారం చేస్తున్న ఓ మిల్లర్ పేర్కొన్నారు. కేవలం ఆరు మిల్లుల్లోనే రూ.140 కోట్లు మాయమైతే గత రెండేండ్లలో కొత్తగా వచ్చిన మిల్లులన్నీ కేవలం సీఎంఆర్ ధాన్యం కోసమే వచ్చాయని, వాటిని తనిఖీ చేస్తే వెలుగు చూసే అక్రమాలు చూసి నివ్వెరపోవడం ఖాయమన్నారు.
ఐదు రోజుల్లో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సూర్యాపేట మండల పరిధిలోని వజ్ర రైసు కార్పొరేషన్, వజ్ర వికాస్ రైసు మార్టుపై దాడి చేసి టెక్నికల్ అసిస్టెంట్లతో లెక్కలు వేయించగా రూ.70 కోట్ల విలువ చేసే 29,187 మెట్రిక్ టన్నుల ధాన్యం లెక్క తేలలేదని, దీంతో మిల్లు యజమానులైన వట్టె జానయ్య యాదవ్, ఆయన సతీమణి రేణుక, కుమారుడు గణేశ్‌పై క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు డీఎస్వో మోహన్‌బాబు తెలిపారు. పెన్‌పహాడ్ మండలం మాచారంలో జేపీ రైసు మిల్లులో రూ.11 కోట్ల విలువ చేసే ధాన్యం, సూర్యాపేట మండలం కాసరబాదలోని ఎస్వీఆర్ఐ రైసు మిల్లులో రూ.18 కోట్లు విలువ చేసే ధాన్యం, సూర్యాపేటలోని నవరత్నా మిల్లులో రూ.10 కోట్ల విలువైన ధాన్యం, రవికృష్ణ మిల్లులో రూ.31 కోట్లు తక్కువ ఉన్నట్లు తేలింది.
నవరత్న మిల్లు యజమాని వెంటనే రూ.10 కోట్లు చెల్లించడంతో కేసు నమోదు కాలేదని, మిగిలిన ఐదు మిల్లుల యాజమాన్యాలపై క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు డీఎస్వో మోహన్‌బాబు తెలిపారు. కాగా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతులు పండించిన ధాన్యం మిల్లర్లకు అప్పగిస్తే జిల్లాలోని పలు మిల్లులో దాదాపు రూ.400 కోట్ల విలువ చేసే ధాన్యం మాయమైంది. ఈ వ్యవహారంలో బీఆర్ఎస్ నాయకుల పాత్ర ఉందంటూ కాంగ్రెస్ నాడు గగ్గోలు పెట్టింది. మరి నేడు కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉండగా కేవలం ఆరు మిల్లుల్లోనే రూ.140 కోట్ల విలువ చేసే ధాన్యం మాయమైంది. మరి ఈ వ్యవహారంలో జిల్లాకు చెందిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు ఆ పార్టీ ఎమ్మెల్యేల పాత్ర ఎంతో చెప్పాలి. లేకుంటే నాడు బీఆర్ఎస్ ప్రభుత్వంపై చేసిన ఆరోపణలు కావాలనే చేసినట్లు అంగీకరించాలని బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు.