బెల్లంపల్లి, జూలై 28 : కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బెల్లంపల్లి నియోజకవర్గ పరిస్థితి అస్తవ్యస్తంగా తయారైందని మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన గడ్డం వినోద్ ఇప్పటికీ సుమారు 31 నెల లు గడిచినప్పటికీ బెల్లంపల్లి నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని ఆరోపిస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మంగళవారం పట్టణంలోని కాంటా చౌరస్తాలో నాయకులు కళ్లకు గంతలు కట్టుకొని నిరసన చేపట్టారు.
ఈ సందర్భంగా దుర్గం చిన్నయ్య మాట్లాడుతూ నియోజకవర్గంలోని అన్ని మండలాలతో పాటుగా పట్టణంలో రహదారులు గుంతలమయంగా మారి ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. పట్టణ నడి ఒడ్డున రోడ్ల విస్తరణ పేరుతో ఇళ్లు, దుకాణాలు కోల్పోయిన నిర్వాసితులకు న్యాయం చేయలేదని, రోడ్డు వెడల్పు పేరుతో బడా వ్యాపారుల వద్ద లక్షలాది రూపాయలు నాయకులు వసూలు చేశారని ఆరోపించారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్, రోడ్ల విస్తరణ నిర్వాసితుల సమస్యలు, సింగరేణి భూముల్లో నివసిస్తున్న అర్హులకు పట్టాల పంపిణీ, ప్రభుత్వ దవాఖానల్లో వైద్యుల కొరత వంటి సమస్యలు ఎమ్మెల్యే ప ట్టించుకోవడం లేదని విమర్శించారు.
బీఆర్ఎస్ ప్రభు త్వ హయాంలో మంజూరైన వంద కోట్ల నిధుల పనులను ప్రొసిడీంగ్ మార్చి వాటితోనే అరకొర పనులు చేశారే తప్పా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కొత్తగా చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు ఏమి లేవని ఆరోపించారు. ప్రభుత్వ భూముల కబ్జాలపై అధికారులు చర్యలు తీసుకోవడం లేదని, రెవెన్యూ యంత్రాంగం ఎమ్మెల్యే కనుసన్నల్లో పని చేస్తోందని విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కన్నాల శివారులో పాత్రికేయులకు కేటాయించిన స్థలాన్ని కూడా కొంతమంది కబ్జా చేయడానికి యత్నించారని ఆరోపించారు. గురుకుల పాఠశాలల్లో నాణ్యతలేని ఆహారం వల్ల విద్యార్థులు అనారోగ్యానికి గురవుతున్నా స్థానిక ఎమ్మెల్యేకు కనిపించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
బెల్లంపల్లి పట్టణ ప్రజల చిరకాల వాంఛ సింగరేణి స్ధలాల్లో స్థిర నివాసాలు ఏర్పరుచుకున్న వారికి తమ ప్రభుత్వ హయాంలో నాలుగు వేలకు పైగా పట్టాలు ఇచ్చామని, మిగిలిన మూడు వేల మంది లబ్ధిదారులకు పట్టాలు ఇవ్వడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. వంద పడకల ప్రభుత్వ దవాఖానలో తగినంత వైద్యులు, సిబ్బంది లేక నియోజకవర్గ ప్రజలు చికిత్స అందక ఇబ్బందులకు గురవుతున్నా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గంలోని యువతకు ఉపాధి కల్పించాలని 350 ఎకరాల్లో ఫుడ్ ప్రాసిసింగ్ యూనిట్ తీసుకురాగా ప్రస్తుత ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోకపోవడంతో అది నిరుపయోగంగా మారిందని పేర్కొన్నారు.
ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద యువత చేపట్టిన నిరసనలకు కేంద్రం దిగివచ్చిందని, అదే తరహాలో నియోజకవర్గంలోని యువత ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్, పలు సమస్యలపై కార్మికు లు, కర్షకులు, యువత ఏకమై ప్రశ్నించాలని పిలుపునిచ్చారు. బెల్లంపల్లి నియోజకవర్గాన్ని గాలికి వదిలేసి హై దరాబాద్, విదేశాల్లో జల్సాలు చేస్తున్న గడ్డం వినోద్ ఇ ప్పటికైనా కళ్లు తెరిచి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. నియోజకవర్గ సమస్యలపై వా రం, పది రోజుల్లో ఎమ్మెల్యే స్పందించకపోతే ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని దుర్గం చిన్నయ్య హెచ్చరించారు. అవసరమైతే ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించడంతో పాటు నిరాహార దీక్షకు కూడా వెనుకాడబోమని స్పష్టం చేశారు. బెల్లంపల్లి ప్రజ ల కోసం ఏ ఉద్యమానికైనా సిద్ధమని స్పష్టం చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్, బీఆర్ఎస్వీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.