రామాయంపేట, జూలై 28: కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చి మూడేండ్లు గడుస్తున్నా రాష్ట్రంలోని దేవాలయాల అభివృద్ధికి ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని మెదక్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మాదేవేందర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.మంగళవారం మెదక్ జిల్లా రామాయంపేటలో ఏడీదుల ఎల్లమ్మ బోనాలకు ఆమె హాజరై పూజలు చేశారు.అనంతరం ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ సర్కార్ ‘పేరు గొప్ప ఊరు దిబ్బ’ అన్న చందంగా తయారైందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు తుంగలో తొక్కి బీఆర్ఎస్ నాయకులను విమర్శించడం పద్ధతి కాదన్నారు.
మెదక్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మంజూరు చేసిన పనులకు మళ్లీ రీ ఓపెనింగ్ చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఇప్పటి వరకు అమలు కాలేదన్నారు. తెలంగాణ అభివృద్ధి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తోనే సాధ్యమన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకులు విమర్శలు మాని అభివృద్ధిపై దృష్టిని సారించాలని హితవుపలికారు. మాజీ ఎమ్మెల్యే వెంట రామాయంపేట మాజీ పురపాలిక చైర్మన్ పల్లె జితేందర్‌గౌడ్, బీఆర్ఎస్ నాయకులు అస్నొద్దీన్, శ్రీకాంత్ సాగర్, విద్యాకర్రాజు, బాసం శ్రీనివాస్, మధుకర్, రొయ్యల నవీన్, శ్రావణ్‌గౌడ్, మహేశ్, శ్రీను, శివ, శ్రీధర్, హరీశ్ ఉన్నారు.