Lenin | అక్కినేని అఖిల్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘లెనిన్’పై ప్రేక్షకుల్లో ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. యువ దర్శకుడు మురళీకిశోర్ అబ్బూరు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే సినిమా అనౌన్స్‌మెంట్‌తో మంచి అంచనాలు ఏర్పడగా, తాజాగా విడుదలైన టీజర్ సినిమాపై మరింత హైప్ తీసుకొచ్చింది.ఈ సినిమా జూన్ 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం ప్రచార కార్యక్రమాలను వేగవంతం చేసింది. మరోవైపు అక్కినేని నాగార్జున సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి 40 ఏళ్లు పూర్తి చేసుకున్న ప్రత్యేక సందర్భంగా, ‘లెనిన్’ టీజర్‌ను విడుదల చేయడం అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని నింపింది.
విడుదలైన టీజర్లో అఖిల్ స్టైలిష్ లుక్‌తో పాటు మాస్ ఎలిమెంట్స్ కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆయన చెప్పిన డైలాగులు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. “మనోడు వస్తున్నాడు…”, “నేను తప్పిపోయి రాలేదు.. మీ అందరినీ వెతుక్కుంటూ వచ్చా…” అంటూ అఖిల్ చెప్పిన డైలాగులు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. ఈ డైలాగుల్లో కనిపించిన యాటిట్యూడ్, స్క్రీన్ ప్రెజెన్స్ అభిమానులను ఆకట్టుకుంటున్నాయని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఇక టీజర్ విడుదలపై నాగార్జున కూడా స్పందించారు. తనకు ఈ టీజర్ ఒక సర్ప్రైజ్లా అనిపించిందని ఆయన పేర్కొన్నారు. టీజర్ మొత్తం ఎంతో హాయిగా, ఆకట్టుకునేలా అనిపించిందని అభిప్రాయపడ్డారు.
ఇటీవల వరుస సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్న అఖిల్‌కు ఈ చిత్రం ఎంతో కీలకంగా మారింది. గత చిత్రాల ఫలితాల తర్వాత మంచి కమ్‌బ్యాక్ కోసం ఎదురుచూస్తున్న ఆయనకు ‘లెనిన్’ మంచి మైలురాయిగా మారుతుందా అనే ఆసక్తి అభిమానుల్లో కనిపిస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్ చూస్తుంటే సినిమాలో యాక్షన్, భావోద్వేగాలు, మాస్ అంశాలు సమపాళ్లలో ఉండబోతున్నట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి. దీంతో జూన్ 26న విడుదల కానున్న ఈ సినిమాపై అక్కినేని అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.