రామగిరి, జూన్ 30 : పెండింగ్‌లో ఉన్న కళాశాల విద్యార్థుల ఫీజురీయింబర్స్‌మెంట్ విడుదల చేయకుండా ఫ్రభుత్వం విద్యార్ధుల జీవితాలతో చెలగాటమాడుతోందని తక్షణమే ఫీజు రీయింబర్స్‌మెంటు విడుదల చేయాలని కోరుతూ బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో మంగళవారం జిల్లాలోని కళాశాలల బంద్ నిర్వహించారు. కళాశాలలు తెరిచే ఉండటంతో అక్కడికి చేరుకుని తరగతులు బహిష్కరించారు. ఈ సందర్భంగా బీసీ విద్యార్ధి సంఘం జిల్లా అధ్యక్షుడు ఐతగోని జనార్దన్‌గౌడ్ మాట్లాడుతూ విద్యార్థులకు రావాల్సిన ఫీజురీయింబర్స్‌మెంట్, స్కాలర్షిప్ను ఫ్రభుత్వం విడుదల చేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బంద్‌లో రజక అభివృద్ధి సంస్థ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు చిలకరాజు సతీష్, విద్యార్థి సంఘం నాయకులు కొంపల్లి రామన్నగౌడ్, అనంత నాగరాజు, గడగోజు విజయాచారి, నాగేష్, హరిప్రసాద్, కృష్ణ్ణ, మహేష్, శివ, మధు, మల్లేష్, నరేష్, పృథ్వీరాజ్, మణికంఠ పాల్గొన్నారు.
మిర్యాలగూడ, జూన్ 30 : మంగళవారం మిర్యాలగూడలో కళాశాలల బంద్ విజయవంతమైంది. మిర్యాలగూడ నియోజకవర్గంలో బీసీ యువజన సంఘం రాష్ట్ర వరింగ్ ప్రెసిడెంట్ తిరుమలగిరి అశోక్ ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు పట్టణంలోని ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలలను మూయించివేశారు. ఈ సందర్భంగా తిరుమలగిరి అశోక్ మాట్లాడుతూ విద్యార్థులకు అందాల్సిన ఫీజు బకాయిలను విడుదల చేయకపోవడంతో విద్యార్థులు ఉన్నత చదువులకు దూరమవుతున్నారని మండిపడ్డారు. కళాశాలల యాజమాన్యాలు సర్టిఫికెట్లను ఇవ్వడం లేదన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జక నాగేశ్వరరావు, బీసీ యువజన సంఘం జిల్లా కన్వీనర్ సిద్ధం రాజు, బీసీ యువజన సంఘం పట్టణ నాయకులు పట్టేటి రమేష్, బీసీ యువజన సంఘం నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు.