యాదగిరిగుట్ట, సెప్టెంబర్ 25 : తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా ఉన్న బతుకమ్మ పండుగకు కాంగ్రెస్ పాలనలో తీవ్ర అవమానం జరుగుతోందని ప్రభుత్వ మాజీ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణతల్లి విగ్రహం చేతిలో బతుకమ్మ లేదు.. బతుకమ్మ పండుగకు నిధుల్లేవు.. మహిళలకు బతుకమ్మ చీరెలు బంద్ చేశారంటూ గురువారం యాదగిరిగుట్టలోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. మహిళలు బతుకమ్మ పండుగను సంతోషంగా జరుపుకోకుండా యూరియా కోసం లైన్లు కడుతున్నారన్నారు. బతుకమ్మ పండుగను కనుమరుగు చేయాలని రేవంత్‌రెడ్డి సంకల్పిస్తున్నట్లుగా ఉందన్నారు. పండుగ సమయంలో కేసీఆర్ అన్ని ఏర్పాట్లు చేస్తే.. కాంగ్రెసోళ్లు మహాలక్ష్మి పేరుతో మహిళలను బతుకమ్మ ఆడకుండా చేస్తున్నారని ఆరోపించారు. పార్లమెంటు ఆమోదం తెలిపిన తర్వాతే బీసీ రిజర్వేషన్లు అమలు చేయాల్సి ఉంటుందన్నారు. జీవో ఇచ్చి ఎన్నికలకు వెళ్లాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆలోచన చేస్తున్నారని ఆరోపించారు.
కొండపై ఆటో కార్మికులు దేవస్థానికి రూ.31.42 లక్షలు బకాయి పడ్డారని చెల్లించకపోతే కొండపైకి ఆటోలు రాకుండా అడ్డుకుంటామని దేవస్థానం ఇచ్చిన నోటీసులను సునీతామహేందర్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు. బేషరతుగా వారిని కొండపైకి అనుమతించాలని, వారి పక్షాన పోరాటం చేస్తామన్నారు. గత ఎన్నికల సమయంలో కొండపైకి ఆటోలు పంపిస్తామని కేటీఆర్ హామీఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఆటో కార్మికులు కష్టపడి సంపాదించుకున్న సొమ్మును కట్టాలని ఆదేశాలివ్వడం అత్యంత దుర్మార్గమన్నారు. దేవస్థానం బకాయి నోటీసులను వెంటనే వెనక్కి తీసుకోవాలన్నారు. గతంలో మాదిరిగానే ఉచితంగా ఆటోలు నడిపించుకునే వెసులుబాటు కల్పించాలన్నారు.
పదేళ్ల కేసీఆర్ పాలనలో రాని యూరియా కొరత కేవలం రెండున్నరేళ్లలో ఎలా వచ్చిందో సీఎం రేవంత్‌రెడ్డి రైతులకు సమాధానం చెప్పాలని బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. ఇప్పటికీ 54 సార్లు ఢిల్లీ వెళ్లిన ఆయన యూరియాను ఎందుకు తీసుకురాలేకపోయాడో చెప్పాలన్నారు. 2023 ఎన్నికల్లో మోస పూరిత హామీలతో అధికారంలోకి వచ్చారని అన్నారు. కాంగ్రెస్‌లో చేరిన పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్లాలన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీల ఆదాయం పెరుగుతుంటే, ప్రభుత్వ ఆదాయం తగ్గుతూ వస్తోందన్నారు.
ప్రజా సమస్యలు, రైతుల సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేసులు పెడతారా అని బీఆర్ఎస్ పార్టీ రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గొంగిడి మహేందర్‌రెడ్డి ప్రశ్నించారు. పోలీసుల అత్యుత్సాహంతో కార్యకర్తలపై కేసులు పెడుతున్నారని అన్నారు. సైదాపురం కత్వను తొలగించి అక్రమంగా నీళ్లు తీసుకుపోతుంటే తొలగించిన వారిపై కేసులు పెట్టాలి కానీ, రైతుల పక్షాన నిలిచిన వారిపై కేసులు పెట్టడమేమిటని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ కోసం పనిచేస్తున్న మండల పార్టీ అధ్యక్షుడు కర్రె వెంకటయ్యపై పది కేసులు పెట్టారని అన్నారు. ఎంత మందిపై ఎన్ని కేసులు పెట్టినా భయపడే ప్రసక్తే లేదన్నారు. వచ్చేది తమ ప్రభుత్వమేనన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కర్రె వెంకటయ్య, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గడ్డమీది రవీందర్ గౌడ్, ఆలేరు మన్సిపల్ మాజీ చైర్మన్ వస్పరి శంకర్, నార్ముల్ డైరెక్టర్ కస్తూరి పాండు, మాజీ ఎంపీటీసీ బీర్ల మహేశ్, మాజీ సర్పంచులు తోటకూరి బీరయ్య, బీసు చందర్ గౌడ్, మాజీ ఎంపీటీసీ కాల్నె అయిలయ్య, యువజన విభాగం నాయకులు భీమగాని నర్సింహ, వివిధ మండలాల నాయకులు పోలగాని వెంకటేశ్, పీఏసీఎస్ చైర్మన్ గూదె బాలనర్సింహ, జిల్లా నాయకుల కోరె భిక్షపతి, అంకం నర్సింహ తదితరులు పాల్గొన్నారు.