రామగిరి , అక్టోబర్ 2 : ఊరూ వాడా బతుకమ్మ పండుగ ప్రారంభమైంది. నిండు అమావాస్య నాడు నెలవంక నేలకు దిగి ఆడబిడ్డల నెత్తిన పొడిచినట్టు వెలుగు పూల సంబురం వెల్లివిరిసింది. బుధవారం ఎంగిలిపూల బతుకమ్మతో తొమ్మిది రోజుల పూల జాతరకు ఆడబిడ్డలు ఘనంగా స్వాగతం పలికారు. పొద్దుగాల నుంచే తీరొక్క పూలతో అందంగా పేర్చిన బతుకమ్మలను ఒక్క చోటకు చేర్చి.. ‘ఏమేమి పువ్వొప్పునే గౌరమ్మ.. ఏమేమి కాయొప్పునే గౌరమ్మ’ అంటూ అమ్మను ఆరాధించారు. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. బంగారు బతుకమ్మ ఉయ్యాలో… అంటూ పదం కలుపుతూ, పాదం కదుపుతూ సంబురం చేశారు.
ఊరూవాడ ఉయ్యాల పాటలతో
హోరెత్తించి ప్రకృతి వేడుకకు పట్టం గట్టారు. నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రాల్లో మైదానాల్లో, కాలనీల్లో అంగరంగ వైభవంగా ఎంగిలిపూల బతుకమ్మ ఆడారు.పిల్లలు, పెద్దవాళ్లు కలిసి సంతోషం పంచుకున్నారు. రెండో భద్రాద్రి పేరున్న నల్లగొండ రామగిరిలోని సీతారామచంద్రస్వామి దేవాలయం ఆవరణ బతుకమ్మలతో తరలివచ్చిన మహిళలతో కిక్కిరిసింది.
ఆలయ ప్రధాన అర్చకులు శఠగోపాలాచార్యులు ముందుగా వెంపని చెట్టు, బతుకమ్మలకు పూజలు చేశారు. అనంతరం మహిళలు బతుకమ్మ ఉత్సవాలను ప్రారంభించారు. గంటల తరబడి ఆడి పాడి వాయినాలు, ప్రసాదం ఇచ్చిపుచ్చుకున్నారు. అనంతరం బతుకమ్మలకు గంగమ్మ ఒడికి చేర్చారు. రెండోరోజు గురువారం అటుకుల బతుకమ్మ ఆడనున్నారు.