గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నాయకులు ఓటుకు వెయ్యి రూపాయలు ఇచ్చారు. డబ్బుకు ఆశపడి కాంగ్రెస్‌కు ఓటేసి గెలిపించాం. ఒక్కరోజు రూ.వెయ్యి తీసుకొని కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన పాపానికి రెండున్నర ఏండ్లుగా ఇబ్బంది పడుతున్నాం. రైతుబంధు సక్రమంగా ఇవ్వడం లేదు. రుణమాఫీ చేయడం లేదు. యూరియా కొరత. ధాన్యం కొనుగోలు చేసేందుకూ ప్రభుత్వం అష్టకష్టాలపాలవుతోంది. కేసీఆర్ పాలనలో రైతులకు ఏ బాదరాబందీ ఉండేది కాదు. సీజన్ ప్రారంభంలోనే రైతుబంధు పడేది. యూరియా, అడుగుమందుకు ఏ ఇబ్బందీ పడలేదు. దుకాణాదారుకు ఫోన్ చేస్తే యూరియా బస్తాలు ఇంటికి వచ్చేవి. ఐకేపీ కేంద్రాల్లో వెనువెంటనే ధాన్యం కొనుగోలు చేశారు. ధాన్యం అమ్మిన వారం రోజుల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులుపడేవి.
హాలియా, మే 8: నాగార్జునసాగర్ నియోజకవర్గంలో ధాన్యం కొనుగోలు నత్తనడకసాగుతోంది. గ్రామాల్లోని ఐకేపీ కేంద్రాల్లో ఎక్కడి ధాన్యం నిల్వలు అక్కడే పేరుకుపోయాయి. యాసంగి కొనుగోళ్లు ప్రారంభమై నెలరోజులు కావస్తున్నా నేటికీ ప్రభుత్వం రైతుల వద్ద నుంచి సగం ధాన్యం కూడా కొనుగోలు చేయలేదు. ఆరుగాలం కష్టపడి పంట పండించిన రైతులు అమ్ముకోవడానికి అష్టకష్టాలు పడుతున్నారు. ఐకేపీ కేంద్రంలో పోసి 15 రోజులు దాటినా ధాన్యం కొనుగోలు చేసే నాథుడే కరువయ్యాడు.
నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని ఐకేపీ కేంద్రాల్లో రైతులకు కనీస సౌకర్యాలు కల్పించడం లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఐకేపీ కేంద్రాల్లో టెంట్లు, మంచినీటి సౌకర్యం కల్పించింది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోనికి వచ్చాక ఐకేపీ కేంద్రాల నిర్వాహకులు రైతులకు కనీస మంచినీరు, టెంటు సౌకర్యం కల్పించడం లేదు. 44 డిగ్రీల ఎండలో ధాన్యాన్ని తూర్పారబట్టి శుద్ధి చేసినప్పటికీ కొనుగోలు చేసేందుకు మిల్లర్లు కొర్రీలు పెడుతున్నారని రైతులు వాపోతున్నారు. ఐకేపీ కేంద్రాల్లో గోనె సంచులు, హమాలీలు, లారీల కొరత రైతులను తీవ్రంగా వేధిస్తోంది. దీనికి తోడు ఐకేపీ కేంద్రాల నిర్వాహకులు బస్తా 40 కేజీలకు బదులు 42 కేజీల తూకం వేస్తూ నిలువు దోపిడీ చేస్తున్నారు.
దేశానికి రైతు వెన్నెముక, రైతు లేనిదే రాజ్యం లేదు. ఎద్దు ఏడ్చిన అవుసం రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడిన దాఖలాలు లేవన్నది చరిత్ర చెప్పిన సత్యం. రైతు సంక్షేమాన్ని విస్మరిస్తే జరిగే పరిణామాలను చరిత్ర ఎంతో స్పస్టంగా చెప్పినా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి మాత్రం కనువిప్పు కల్గడం లేదు. సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం రైతు సంక్షేమాన్ని గాలికి వదిలేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతలు రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీనీ అమలు చేయడం లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఎకరానికి రూ.10 వేల రైతుబంధు ఇస్తే.. అధికారంలోనికి వచ్చిన వెంటనే ఎకరానికి రూ.15 వేల రైతు భరోసా ఇస్తామని హామీ ఇచ్చి నేడు మాట తప్పారు. క్వింటాల్‌కు రూ.500 బోనస్ ఇస్తామన్న హామీకి రాంరాం చెప్పారు. దళారులు, మిల్లర్లతో కుమ్మక్కైన ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసేందుకు కొర్రీలు పెడుతోంది.
అనుముల మండలంలో సగం ధాన్యం ఐకేపీ కేంద్రాల్లోనే ఉంది. రాష్ట్ర ప్రభుత్వం 15 గ్రామాల్లో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. 20 రోజులుగా ప్రభుత్వం మండలంలోని 852 మంది రైతుల వద్ద నుంచి 74,711 క్వింటాళ్ల ధాన్యం మాత్రమే కొనుగోలు చేసింది. మండలంలోని ఆయా ఐకేపీ కేంద్రాల్లో 62,400 బస్తాలకుపైగా ధాన్యం అమ్మకానికి సిద్ధంగా ఉంది. ఒక్క అనుముల మండలంలోనే ఇలాంటి పరిస్థితి ఉంటే మిగిలిన ఐదు మండలాల్లో సుమారు 4 లక్షల బస్తాల ధాన్యం ఐకేపీ కేంద్రాల్లో మూలుగుతోంది. అకాల వర్షాలకు రైతులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికైన జిల్లా యంత్రాంగం స్పందించి ధాన్యాన్ని యుద్ధప్రాతిపదికన కొనుగోలు చేసి న్యాయం చేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది.
ధాన్యం కొనుగోలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. దళారులు, మిల్లర్లు కలిసి రైతులను తరుగు పేరుతో నిలువు దోపిడీ చేస్తున్నారు. రైతులకు కనీస మద్దతు ధర చెల్లించడం లేదు. మంత్రి, ఎమ్మెల్యేలు మిల్లర్లు ఇచ్చే కమీషన్లకు కక్కుర్తిపడి రైతులను మోసం చేస్తున్నారు. దళారులు, మిల్లర్ల దోపిడీ నుంచి రైతులను కాపాడాలి. రైతులకు కనీస మద్దతు ధర చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలి. ధాన్యం కొనుగోలు చేయాలి. మిల్లర్లు వెంటనే దిగుమతి చేసుకోవాలి.
-నోముల భగత్‌కుమార్. మాజీ ఎమ్మెల్యే
అనుముల మండలంలో ధాన్యం కొనుగోలు నత్తనడకన సాగుతోంది. ఐకేపీ కేంద్రాల్లో ధాన్యం పోసి 15 రోజులైనా కొనుగోలు చేసే దిక్కులేదు. బస్తాలు, లారీల కొరత తీవ్రంగా ఉంది. నిర్వాహకులు, మిల్లర్లు ఏకమై తాలు పేరుతో బస్తాకు 2 కేజీలు అదనంగా తీసుకుంటూ రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారు.
-అనుముల శంకర్, ఇబ్రహింపేట
నార్కట్‌పల్లి, మే 8: ‘పెరుగుతున్న వ్యవసాయ పెట్టుబడులు. ఎరువులు అందడం లేదు. సమయానికి రుణమాఫీ కాలేదు. ఆర్థికంగా కుదేలవుతున్న అన్నదాతలు పండించిన ధాన్యం కొనుగోలు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది’ అని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. శుక్రవారం నార్కట్‌పల్లిలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. ధాన్యం రాశులను పరిశీలించిన రైతులతో మాట్లాడారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కేసీఆర్ సర్కారులో రైతులు పండించిన చివరి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేసిందన్నారు. వారం రోజుల్లోనే రైతుల ఖాతాలో సొమ్ము జమ చేశారని గుర్తు చేశారు. కాంగ్రెస్ సర్కార్ పంటలు కొనుగోలు చేయడం లేదన్నారు. ‘ రేయింబవళ్లు వర్షాల భయంతో రైతులు భయపడుతున్నారు. అన్నదాతల జీవితాలు అంధకారంలోకి నెట్టివేయబడ్డాయి’ అని విమర్శించారు. రైతు కన్నీరు పెట్టుకుంటే ఈ ప్రభుత్వానికి పతనం తప్పదని హెచ్చరించారు. ప్రభుత్వం తక్షణమే వడ్లు కొనుగోలు ప్రారంభించాలని, లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు బైరెడ్డి కరుణాకర్ రెడ్డి, మేకల రాజిరెడ్డి, బొక్క భూపాల్ రెడ్డి, దుబ్బాక శ్రీధర్, మేడబోయిన రాంబాబు, నడింపల్లి మహేష్, పుల్లెంల మహేష్, జానీ పాల్గొన్నారు.
ఆత్మకూరు(ఎం), మే 8: ధాన్యం కొనుగోళ్లలో జాప్యం ఏర్పడటంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. మండల కేంద్రంలోని సబ్ మారెట్ యార్డు, కూరెళ్ల, పుల్లాయిగూడెంలో ఐకేపీ, పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నిలిచిపోయింది. మండల కేంద్రంలోని సబ్ మారెట్ యార్డులో 114 మంది రైతులు ధాన్యం రాసులు పోశారు. కేవలం 20 మంది రైతుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేశారు. కూరెళ్లలో 150 మంది రైతులు ధాన్యం రాసులు పోయగా ఇందులోని నుంచి 50 మంది రైతుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేశారు. పుల్లాయిగూడెంలో 152 మంది రైతులు ధాన్యం రాసులుగా పోయగా ఇందులో నుంచి 50 మంది రైతుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేశారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి వెనువెంటనే ధాన్యం కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు.