– సామాన్యులకు ఒక చట్టం కేంద్ర హోం శాఖ సహాయ మంత్రికి ఒక చట్టమా?
– తల్లిదండ్రులను బెదిరింపులకు గురి చేస్తున్న బండి సంజయ్ పై కూడా కేసు నమోదు చేయాలి
– మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్
సూర్యాపేట, మే 11 : బీసీ బలహీన వర్గానికి చెందిన బాలికను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ మానసికంగా, లైంగికంగా వేధింపులకు గురిచేసి చిత్రహింసలకు గురి చేయడం దుర్మార్గమని మాజీ రాజ్యసభ సభ్యుడు, బీఆర్ఎస్ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు. సోమవారం ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు ఇంతటి దుర్మార్గానికి పాల్పడడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఫోక్సో కేసు నమోదైనా భగీరథను ఇప్పటివరకు అరెస్టు చేయకపోవడం పోలీసుల నిర్లక్ష్యానికి నిదర్శనం అన్నారు. చట్టం అందరికీ ఒకేలా ఉండాలని సామాన్యుడికి ఒకలా, కేంద్ర మంత్రి కుమారుడికి మరోలా చట్టం ఉంటుందా అని ఆయన ప్రశ్నించారు. ప్రధానమంత్రి మోదీ హైదరాబాద్ వస్తుండని బాధిత కుటుంబం ఆయనకు విన్నవించి ఆత్మహత్య చేసుకుంటామని అంటే గానీ ఫోక్సో కేసు నమోదు చేయడం జరిగిందన్నారు.
ఫోక్స్ కేసులో సైతం సెక్షన్లు 5-7 పెట్టకుండా 11 సెక్షన్ పెట్టడం అనుమానాలకు తావిస్తుందన్నారు. అలాగే కేంద్ర మంత్రిగా ఉన్న బండి సంజయ్ బాలిక తల్లిదండ్రులను బెదిరించినందుకు ఆయనపై కూడా కేసు నమోదు చేయాలన్నారు. భగీరథను ఫోక్సో కేసు కింద అరెస్ట్ చేసి మైనర్ తల్లిదండ్రులను వేధింపుల నుండి కాపాడాలన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం, పోలీసులు, ఉన్నతాధికారులు స్పందించి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పై కేసు నమోదు చేయడంతో పాటు ఆయన కుమారుడిని ఫోక్సో కేసులో వెంటనే అరెస్టు చేసి మెజిస్ట్రేట్ ముందు హాజరు పరచాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో బీఆర్ఎస్ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం చేసి బాలిక కుటుంబానికి అండగా న్యాయం జరిగే వరకూ పోరాడుతుందని పేర్కొన్నారు.