ఆస్కార్ విజేత, ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి ప్రస్తుతం ‘వారణాసి’ సినిమా పాటల పనిలో బిజీగా ఉన్నారు. సినిమాకు పాటలు ముఖ్యమే. కానీ నేపథ్య సంగీతం అంతకంటే ముఖ్యం. సన్నివేశాల్లోని గాఢత మరింత ఎలివేట్ అవ్వాలంటే, అందుకు తగ్గ నేపథ్య సంగీతం అమరాలి. మరీ ముఖ్యంగా రాజమౌళి లాంటి దర్శకుల చిత్రాల్లో అయితే.. నేపథ్య సంగీతం పాత్ర మరింత ఎక్కువ ఉంటుంది.
అయితే.. ఇప్పటివరకూ కీరవాణి ‘వారణాసి’ సినిమా నేపథ్య సంగీతం పనులు మొదలుపెట్టలేదు. తాజా చిట్‌చాట్‌లో ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు కీరవాణి. సెప్టెంబర్ నుంచి ఆర్ఆర్ పనులు మొదలుపెట్టనున్నట్టు ఆయన ప్రకటించారు. ప్రతిష్టాత్మక ‘వారణాసి’ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కోసం నాలుగు నెలలు కేటాయించినట్టు కీరవాణి పేర్కొన్నారు. వచ్చే ఏడాది జనవరి కల్లా ‘వారణాసి’ నేపథ్య సంగీతం పనులను పూర్తి చేస్తానని ఆయన తెలిపారు.