హనుమకొండ, జూలై 28 : ఉమ్మడి వరంగల్‌లోని జిల్లా, మండల పరిషత్‌ల్లో నిధుల కొరత తీవ్రంగా వేధిస్తున్నది. ఈ నేపథ్యంలో మండల పరిషత్ సమావేశాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే కార్యాలయ నిర్వహణ భారంగా మారగా, ప్రస్తుతం సమావేశాలు నిర్వహించాలనే సర్కారు ఆదేశాలతో ఎంపీడీవోలు ఆంతర్మథనంలో పడ్డారు. కనీసం చాయ్, బిస్కెట్లకు ఖర్చు చేసేందుకు కూడా డబ్బులు లేవని వాపోతున్నారు. 2024 జూన్ 3వ తేదీన మండల పరిషత్, 4న జిల్లాపరిషత్ పాలక వర్గం గడువు ముగిసింది.
అయితే పాలక వర్గం ఉన్నంత వరకు 15వ ఆర్థిక సంఘం నిధులు కేంద్రం ఇచ్చినప్పటికీ గడువు ముగిసిన తర్వాత వాటిని నిలిపివేసింది. అంతేకాక కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి స్టేట్ ఫైనాన్స్ నిధులు కూడా మంజూరు కావడం లేదని పంచాయతీరాజ్ అధికారులు అంటున్నారు. వాస్తవానికి గ్రామాల అభివృద్ధికి 15వ ఆర్థిక సంఘంతో పాటు స్టేట్ ఫైనాన్స్ నిధులు వినియోగించేవారు. రెండేళ్లుగా ఇవి నిలిచిపోవడంతో జిల్లా, మండల పరిషత్‌లు నిధుల లేమితో కొట్టుమిట్టాడుతున్నాయి.
కేంద్ర ప్రభుత్వం మాత్రం జిల్లా, మండల పరిషత్‌లకు ఎన్నికలు నిర్వహించే వరకు ఆర్థిక సంఘం నిధులు ఇవ్వమని స్పష్టం చేసినట్లు పీఆర్ అధికారులు తెలిపారు. దీంతో పరిస్థితి మరింత క్లిష్టతరంగా మారిందని పలువురు ఎంపీడీవోలు వాపోతున్నారు. కాగా గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగడంతో కేంద్ర నిధులు నేరుగా వాటి ఖాతాల్లో జమవుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఇప్పటికే నిధులు లేక ఇబ్బందులు పడుతున్న తాము బుధవారం నుంచి సమావేశాలు ఎలా నిర్వహించాలోనని ఎంపీడీవోలు మదనపడుతున్నారు.
రెండేళ్ల తర్వాత సమావేశాలు
రెండేళ్ల తర్వాత మండల పరిషత్ సమావేశాల నిర్వహణకు మోక్షం లభించింది. బుధవారం నుంచి ప్రతి 45 రోజులకు ఒకసారి తప్పక సమావేశం నిర్వహించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఇందుకు అనుగుణంగా పంచాయతీరాజ్ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఎంపీపీలు లేకపోవడంతో ప్రత్యేక అధికారి ఆధ్వర్యంలో ఈ సమావేశాలు కొనసాగనున్నాయి. కాగా పాలక వర్గాలున్నప్పుడు మూడు నెలలకొకసారి నిర్వహించే సమావేశాలకు జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, అధికారులు హాజరై ఆయా గ్రామాల సమస్యలను ప్రస్తావించేవారు.
ప్రస్తుతం పాలక వర్గాలు లేకపోవడంతో గ్రామాలకు పంచాయతీ కార్యదర్శులు మినహాయించి ఇతర శాఖల అధికారులు వచ్చిన దాఖలాలు లేవని గ్రామాస్తులు ఆరోపిస్తున్నారు. అలాగే పంచాయతీ ఎన్నికలు పూర్తయినా కొందరు కొత్తవారు సర్పంచ్‌లుగా ఎంపిక కావడంతో సమస్యలను ఎవ్వరికి చెప్పుకోవాలో వారికి తెలియని పరిస్థితి ఉన్నట్లు తెలుస్తున్నది. అయితే పాలక వర్గాలుండి సమావేశాలు నిర్వహిస్తే సమస్యలు పరిష్కారమయ్యేవనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.
సమావేశాలు నిర్వహించాలని ఎంపీడీవోలను ఆదేశించాం..
ప్రతి 45 రోజులకు ఒకసారి తప్పకుండా మండల పరిషత్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో బుధవారం హనుమకొండ జిల్లాలోని అన్ని ఎంపీడీవోల కార్యాలయాల్లో ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. ఈ మేరకు ఎంపీడీవోలను ఆదేశించాం. ప్రత్యేక అధికారి అధ్యక్షతన జరిగే సమావేశాలకు సర్పంచ్‌లు, అధికారులు హాజరవుతారు.
-శేషాద్రి, జడ్పీసీఈవో, హనుమకొండ జిల్లా