సూర్యాపేట, ఏప్రిల్ 23 : కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం నియమించిన పీసీ ఘోష్ కమిషన్ నివేదిక చెల్లదని హైకోర్టు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్‌రెడ్డికి చెంపపెట్టు అని రాజ్యసభ మాజీ సభ్యుడు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు. గురువారం బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాళేశ్వరంపై రేవంత్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మాట్లాడిన మాటలు తప్పుడు మాటలని హైకోర్టు తీర్పుతో తేలిపోయిందన్నారు. కాళేశ్వరం అంటే ఒక మేడిగడ్డ కాదని 210 కిలోమీటర్ల సొరంగం, బ్యారేజీలు, లిఫ్టులు, కాల్వలు కాళేశ్వరంలో భాగమని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి ఖర్చు చేసింది రూ. 94వేల కోట్లని వారే చెప్పి, ఇప్పుడు లక్ష కోట్ల అవినీతి జరిగిందనడం సరి కాదన్నారు.
నేడు మెదక్, మహబూబ్‌నగర్ జిల్లాలకు కాళేశ్వరం ద్వారా నీరు అందిందని, ఒక్క సూర్యాపేట జిల్లాలోనే రెండున్నర లక్షల ఎకరాల్లో రైతులు 9 కార్ల పంట పండించారన్నారు. ఈ రెండేళ్ల నుంచీ కాళేశ్వరం నీళ్లొస్తే కేసీఆర్ గుర్తొస్తడని కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేసిందన్నారు. కేసీఆర్‌పై కక్షతో కాళేశ్వరాన్ని ఆగం చేయాలని చూశారన్నారు. ఇప్పటికైనా రైతులపై ప్రభుత్వానికి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా వెంటనే కాళేశ్వరంలోని రెండు పిల్లర్లకు మరమ్మతులు చేయించి నీరివ్వాలని లేని పక్షంలో రైతులను సమీకరించి బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.
సమావేశంలో బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వై.వెంకటేశ్వర్లు, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ పుట్ట కిషోర్, మాజీ ఎంపీపీ నెమ్మాది భిక్షం, మాజీ జడ్పీటీసీ జీడి భిక్షం, మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ ఆకుల లవకుశ, నాయకులు బండారు రాజా, తూడి నర్సింహారావు, బొమ్మగాని శ్రీనివాస్, బెల్లంకొండ యాదగిరి, కోడి సైదులు, అమరవాది శ్రావణ్ పాల్గొన్నారు.
నడిగూడెం, ఏప్రిల్ 23: కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘెష్ కమిటీ నివేదికను తప్పు పడుతూ హైకోర్టు ఇచ్చిన తీర్పు హర్షణీయమని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. గురువారం మండల పరిధిలోని కరివిరాలలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రేవంత్‌రెడ్డి నియమించింది.. పీసీ ఘెష్ కమిషన్ కాదని.. పీసీసీ కమిషన్ అని అన్నారు. హైకోర్టు తీర్పు కాంగ్రెస్ పార్టీకి చెంపపెట్టు అన్నారు. అనంతరం కాగిత రామచంద్రాపురం గ్రామానికి చెందిన లీల భిక్షంను పార్టీలోకి ఆహ్వానించారు.
కార్యక్రమంలో మండల అధ్యక్షుడు పల్లా నర్సిరెడ్డి, అనంతుల ఆంజనేయులు, గార్లపాటి శ్రీనివాసరెడ్డి, నలమాద నారాయణరావు, నరసింహారావు, జలీల్, కందిబండ సత్యం, కోలా ఉపేందర్, దున్న సుధాకర్, కాసాని ఉపేందర్, పుట్టా సీతయ్య, మేకల గంగరాజు, మేకల వీరబాబు, కాసాని ఉపేందర్, లింగయ్య, రణబోతు రామిరెడ్డి, చింతకుంట్ల వెంకటరెడ్డి, ధనియాకుల కృష్ణమూర్తి పాల్గొన్నారు.
ఆత్మకూరు(ఎం), ఏప్రిల్ 23 : పీసీ ఘోష్ కమిషన్ నివేదికను తప్పుపడుతూ హైకోర్టు ఇచ్చిన తీర్పు తరువాత నైనా కాంగ్రెస్ పార్టీ బుద్ధి తెచ్చుకోవాలని ప్రభుత్వ మాజీ విప్ గొంగిడి సునీత మహేందర్‌రెడ్డి అన్నారు. గురువారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ తెలంగాణకు జీవధారైన కాళేశ్వరం ప్రాజెక్టుపై నిందలు మోపి, కేసీఆర్ ప్రతిష్టను దెబ్బతీయడానికి కాంగ్రెస్, బీజేపీలు ప్రయత్నించాయన్నారు. ప్రాజెక్టు మరమ్మతులను రెండున్నరేళ్లు ఆలస్యం చేశారని, చివరకు గత్యంతరం లేకనే పనులు ప్రారంభించారన్నారు. సమావేశంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బీసు చందర్‌గౌడ్, జిల్లా నాయకులు యాస ఇంద్రారెడ్డి, కోరే బిక్షపతి, స్థానిక సర్పంచ్ బీసు ధనలక్ష్మి, మహిళా విభాగం మండల అధ్యక్షురాలు సోలిపురం అరుణ, నాయకులు కాలే మల్లేశం, కొడిమల యాదగిరి, గజ్జెల్లి శంకర్, నాతి రాజు, అబ్బాసాయిలు, అజీమ్, రాంబాబు, ఉపేందర్, నరేష్ పాల్గొన్నారు.
భువనగిరి కలెక్టరేట్, ఏప్రిల్ 23 : పీసీ ఘోష్ కమిటీ నివేదికను హైకోర్టు కొట్టేసినా కాంగ్రెస్ ప్రభుత్వం, నాయకులు ఇంకా జనాన్ని మభ్యపెట్టాలనుకోవడం వారి అవివేకానికి నిదర్శనమని భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి అన్నారు. గురువారం బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి, పార్టీ రాష్ట్ర నాయకుడు కల్లూరి రామచంద్రారెడ్డితో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
కాళేశ్వరంపై రేవంత్‌రెడ్డి ఆరోపణలు, రాజకీయ కుట్ర లు హైకోర్టు తీర్పుతో పటాపంచలయ్యాయని పార్టీ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. కేసీఆర్ పాలనలో రైతులు, సబ్బండ వర్గాల జనం సుఖసంతోషాలతో ఉన్నారని, రేవంత్‌రెడ్డి పాలనలో జనం సమస్యలతో సతమతమవుతున్నారని అన్నారు.
రాష్ట్రంలోని కాంగ్రెస్ పాలనలు జనం ఛీ కొడుతున్నారని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కల్లూరి రామచంద్రారెడ్డి అన్నారు. రేవంత్‌రెడ్డి సహనం కోల్పోయి మాట్లాడుతున్నారని, ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ కాలం వెళ్లదీస్తున్న కాంగ్రెస్ సర్కారుకు ప్రజలు సరైన సమయంలో బుద్ధి చెబుతారన్నారు. గ్రామాల్లో రేవంత్‌రెడ్డి మాటలపై చర్చలు జరుగుతున్నాయని, ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే బీఆర్ఎస్ అఖండ విజయం సాధిస్తుందన్నారు. కేసీఆర్ చేపట్టిన ప్రాజెక్టులకు రేవంత్‌రెడ్డి ప్రారంభోత్సవాలు చేస్తూ ప్రగల్భాలు పలుకుతున్నారన్నారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ సభ్యుడు సుబ్బూరు బీరు తదితరులు పాల్గొన్నారు.