సూర్యాపేట టౌన్, ఏప్రిల్ 8 : భారత రాష్ట్ర సమితి ఏర్పడి 24 సంవత్సరాలు పూర్తి చేసుకొని 25వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా రజతోత్సవ వేడుకల్లో భాగంగా ఈ నెల 27న వరంగల్‌లో నిర్వహించే బీఆర్ఎస్ భారీ బహిరంగ సభకు అన్ని వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని మాజీ రాజ్యసభ సభ్యుడు, బీఆర్ఎస్ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్యయాదవ్ పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో మంగళవారం ఆయన వరంగల్ సభ పోస్టర్లను ఆవిష్కరించి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. లక్షలాది మందితో నిర్వహించనున్న ఈ సభలో పార్టీ అధినేత కేసీఆర్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ఉద్యమ కార్యాచరణకు దిశా నిర్దేశం చేస్తారన్నారు.
ప్రతి గ్రామం నుంచి రైతులు, కార్మికులు, అన్ని వర్గాల ప్రజలు వచ్చేలా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. గతంలో ఏ ప్రాంతీయ పార్టీకి లేని చరిత్ర బీఆర్ఎస్కు ఉందని, 14 ఏండ్లు ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడి రాష్ర్టాన్ని సాధించిన ఉద్యమ నాయకుడే ముఖ్యమంత్రిగా కేసీఆర్ తెలంగాణ రాష్ర్టాన్ని అభివృద్ధి చేసి దేశానికి రోల్ మోడల్ చేశారని తెలిపారు. సబ్బండ వర్గాలకు సంక్షేమ పథకాలు అందించడంతోపాటు నీటి తీరువా రద్దు, రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, మత్సకారులకు చేపలు, యాదవులకు గొర్రెలు, దళిత బంధును అందజేసిన మహా నాయకుడు కేసీఆర్ అని చెప్పారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రేవంత్‌రెడ్డి పాలనలో రాష్ట్రం అస్తవ్యస్తంగా మారిందన్నారు. ప్రజలంతా మళ్లీ ముఖ్యమంత్రి కేసీఆర్ రావాలని బలమైన ఆకాంక్షతో ఉన్నారని తెలిపారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభకు సూర్యాపేట జిల్లా నుంచి 26వేల మందిని తరలించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. సమావేశంలో జిల్లా మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, మాజీ ఎంపీపీ నెమ్మాది భిక్షం, మాజీ జడ్పీటీసీ జీడి భిక్షం, నాయకులు ఉప్పల ఆనంద్, ఉప్పల సైదులు, బుడిగ నవీన్ పాల్గొన్నారు.
చందంపేట(దేవరకొండ), ఏప్రిల్ 8 : ఈ నెల 27న వరంగల్‌లో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ బహిరంగ సభను విజయవంతం చేయాలని ఆ పార్టీ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ పిలుపునిచ్చారు. సభకు సంబంధించిన పోస్టర్‌ను దేవరకొండలో మంగళవారం ఆయన పార్టీ శ్రేణులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యమ పార్టీగా మొదలైన బీఆర్ఎస్ ప్రస్థానం రాజకీయ పార్టీగా ఎదిగి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఎనలేని కృషి చేసిందన్నారు. పదేండ్ల కేసీఆర్ నాయకత్వంలో అనేక సంక్షేమ పథకాలు అమలయ్యాయని గుర్తు చేశారు. ప్రతి గ్రామం నుంచి జనం సభకు తరలివచ్చేలా నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు లోక్యనాయక్, జనార్దన్‌రావు, గాజుల రాజేశ్, కేతావత్ శంకర్‌నాయక్, రవీందర్, కృష్ణ, జానీబాబా, ఇలియాస్ పటేల్, చంద్రమౌళి, సత్యనారాయణ, ఇద్దయ్య, మధు, బాబా, సతీశ్, రాములు, లక్ష్మీకాంత్ పాల్గొన్నారు.