– మూడు నెలలుగా వెలగని లైట్లు
– పరిష్కరించాల్సిందిగా మున్సిపల్ కమిషనర్‌కు రిటైర్డ్ హెచ్ఎం వినతి
కోదాడ, డిసెంబర్ 30 : 65వ జాతీయ రహదారి నుండి బాబు నగర్ వెళ్లే ప్రధాన రహదారిపై గత మూడు నెలలు నుండి ఎల్ఈడీ లైట్లు వెలగక ప్రయాణికులు ఇబ్బందికి గురవుతున్నారు. విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు సంగమేశ్వర ప్రసాద్ మంగళవారం మున్సిపల్ కమిషనర్‌ను కలిసి సమస్యలతో కూడిన వినతిపత్రం అందజేశారు. అక్టోబర్ నెలలోనే తాను ఈ విషయమై మున్సిపాలిటీకి దరఖాస్తు చేసేనా ఫలితం లేదన్నారు. రెండు రోజుల క్రితం విద్యుత్ శాఖ అధికారులు ట్రాన్స్‌ఫార్మన్‌ను వేసేందుకు నిర్ణయించినప్పటికీ ఇప్పటివరకు ఆ పని జరగలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రహదారి గుండా నిత్యం వందలాది మంది ప్రయాణిస్తుంటారని, రాత్రి సమయంలో ఎదురుగా ఏ వాహనం వస్తుందో తెలియని పరిస్థితిలో పలుమార్లు ప్రమాదాలు చోటుచేసుకున్నట్లు తెలిపారు. ఇక తెల్లవారుజామున వాకింగ్‌కు వెళ్లే వారికి ఇబ్బందిగా మారిందని, తక్షణమే లైట్లను అమర్చి సమస్యను పరిష్కరించాలని మున్సిపల్ కమిషనర్ ను కోరారు.