అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల కావడంతో రాజకీయ పార్టీలు తుది సమరానికి సై అంటున్నాయి. అందులో ఇప్పటికే అధికార బీఆర్ఎస్ తనదైన శైలిలో దూసుకుపోతున్నది. ఆగస్టు 21వ తేదీన ఉమ్మడి జిల్లాలోని 12కు 12 స్థానాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలను మరోసారి అభ్యర్థులుగా ప్రకటించిన విషయం తెలిసిందే. వీరందరికీ ఈ నెల 15న పార్టీ అధినేత కేసీఆర్ స్వయంగా బీ-ఫారాలు అందించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఆ మరుసటి రోజు భువనగిరి గడ్డ నుంచి సీఎం కేసీఆర్ ఉమ్మడి జిల్లాలో ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. ఇక అప్పటినుంచి బీఆర్ఎస్ మరింత దూకుడును పెంచనుందనడంలో సందేహం లేదు. మరోవైపు జిల్లాలోని ప్రధాన విపక్షాలైన కాంగ్రెస్, బీజేపీ నేటికీ అభ్యర్థులను తేల్చుకోలేక సతమతమవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీలో నేతల మధ్య ఆధిపత్య పోరు అభ్యర్థుల ఎంపికకు విఘాతంగా మారగా, బీజేపీకి సరైన అభ్యర్థులు లేక ఇతర పార్టీల నేతలు వస్తే టికెట్టు ఇద్దామని వేచిచూస్తున్న పరిస్థితి నెలకొన్నది. ఎన్నికల షెడ్యూల్ వెలువడడంతో మంగళవారం మిర్యాలగూడలో జరుగాల్సిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటన వాయిదా పడినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
నల్లగొండ ప్రతినిధి, అక్టోబర్ 9 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల కావడంతో రాజకీయ పార్టీలు పోరుకు సై అంటున్నాయి. ఇప్పటికే అధికార బీఆర్ఎస్ పార్టీ ప్రచారంలో దూసుకుపోతుండగా.. విపక్షాలైన కాంగ్రెస్, బీజేపీ నేటికీ అభ్యర్థులను తేల్చలేక సతమతం అవుతున్నాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 12 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా.. అన్ని స్థానాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఈ ఎన్నికల్లో తిరిగి అన్ని స్థానాల్లో గులాబీ జెండా ఎగిరి ఉమ్మడి నల్లగొండ జిల్లాను క్లీన్‌స్వీప్ చేసేలా బీఆర్ఎస్ పక్కా ప్రణాళికతో ఎన్నికల సమరంలోకి దిగింది. అందులో భాగంగానే ఎవరికీ సాధ్యం కాని రీతిలో నోటిఫికేషన్‌కు 71 రోజుల ముందుగా తన అభ్యర్థులను ప్రకటించి ఇతర పార్టీలకు సవాల్ విసిరింది. ఆగస్టు 21న పార్టీ అధినేత కేసీఆర్ ఒకేసారి జిల్లాలోని 12 మంది అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. వివిధ సర్వేల సారాంశం, పార్టీ శ్రేణుల అభిమతం, ప్రజల మనోగతాన్ని పరిగణలోకి తీసుకుంటూ సిట్టింగ్ ఎమ్మెల్యేలే మరోసారి గెలుపు గుర్రాలుగా భావిస్తూ వారికే టికెట్లు కేటాయించారు. పార్టీ అధినేత తమపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకూడదన్న పట్టుదలతో అభ్యర్థుల ప్రకటన నాటి నుంచి నేటి వరకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా నియోజకవర్గాల్లోనే మకాం వేశారు. నిత్యం ప్రజల్లోనే ఉంటూ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో భాగస్వాములయ్యారు. పనిలో పనిగా ఎన్నికల ప్రచారానికి కూడా శ్రీకారం చుట్టారు. దీంతో ఇప్పటికే క్షేత్రస్థాయి వరకు పార్టీ శ్రేణులు ఎన్నికల మూడ్‌లోకి వచ్చేశాయి. పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కదన రంగంలోకి దిగారు. ఇదే సమయంలో కేసీఆర్ సర్కార్ కార్యక్రమాలకు ఆకర్షితులై పెద్ద సంఖ్యలో ఇతర పార్టీల నేతలు, కార్యకర్తలు, సామాన్యులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. దీంతో ఆ పార్టీ మరింత బలపడినైట్లెంది.

ఇప్పటికే ప్రకటించిన పార్టీ అభ్యర్థులందరికీ ఈ నెల 15న తెలంగాణ భవన్లో అధినేత కేసీఆర్ బీ ఫారాలు అందజేయనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఇదే సందర్భంగా అభ్యర్థులతో సమావేశమై ఎన్నికల వ్యూహం, ప్రచార సరళి, మేనిఫెస్టో అంశాలపై దిశానిర్దేశం చేయనున్నారు. ఆ మర్నాడే పార్టీ అధినేత కేసీఆర్ 16వ తేదీన భువనగిరి గడ్డ మీద నుంచి ఉమ్మడి జిల్లాలో ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. సరిగ్గా అభ్యర్థుల ప్రకటనకు ఒక రోజు ముందుగా ఆగస్టు 20న సూర్యాపేటలో మంత్రి జగదీశ్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ పాల్గొని ఉమ్మడి జిల్లాలో అన్ని స్థానాల్లో మరోసారి గులాబీ జెండా ఎగురబోతుందని ధీమా వ్యక్తం చేశారు. యాదృచ్ఛికమే అయినా.. తాజాగా బీ ఫారాలు అందించిన మర్నాడు భువనగిరి గడ్డపై నుంచి కేసీఆర్ ఇచ్చే సందేశంపై పార్టీ శ్రేణులు అమితాసక్తిని కనబరుస్తున్నాయి. పార్టీ అభ్యర్థులంతా ఎన్నికల ప్రచార షెడ్యూల్‌పై దృష్టి సారించగా.. దశల వారీగా అన్ని నియోజకవర్గాల్లో అధినేత కేసీఆర్ బహిరంగ సభలు జరుగనున్నాయి. పలు నియోజకవర్గాల్లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తోపాటు మరీశ్‌రావు రోడ్‌షోలు కూడా ఉండనున్నట్లు తెలుస్తున్నది. కాగా, 2014 ఎన్నికల్లో 12 స్థానాల్లో ఆరు అసెంబ్లీ, ఒక ఎంపీ స్థానాన్ని బీఆర్ఎస్ కైవసం చేసుకోగా.. 2018లో 9 స్థానాల్లో విజయం సాధించింది. తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో సాధించిన విజయాలతో ఉమ్మడి జిల్లా చరిత్రలో తొలిసారిగా అన్ని స్థానాల్లో జెండా ఎగురవేసిన పార్టీగా బీఆర్ఎస్ నిలిచింది.
బీఆర్ఎస్కు తామే ప్రత్యామ్నాయం అంటూ పోటీ పడుతున్న కాంగ్రెస్, బీజేపీ నేటికీ అభ్యర్థులను తేల్చుకోలేకపోతున్నాయి. కాంగ్రెస్ పార్టీ నల్లగొండ, నాగార్జున సాగర్, హుజూర్నగర్, కోదాడ, నకిరేకల్, ఆలేరు, భువనగిరి స్థానాల్లోనే అభ్యర్థులపై స్పష్టతతో ఉన్నట్లు సమాచారం. మిగతా చోట్ల పార్టీ ముఖ్యుల మధ్య ఆధిపత్య పోరుతో ఎటూ తేల్చుకోలేక సతమతం అవుతుంది. ఎవరికి ఇస్తే ఎవరు తిరగబడుతారోనన్న ఆందోళన వెంటాడుతుంది. ఇందులోనే మిర్యాలగూడను సీపీఎంకు, మునుగోడును సీపీఐకి కేటాయిస్తున్నారన్న వార్తల నేపథ్యంలో మరింత గందరగోళం నెలకొంది. ఇక బీజేపీకి మునుగోడు మినహా అన్ని చోట్లా సరైన అభ్యర్థ్దుల కొరత వెంటాడుతున్నది. ఉన్న నేతల్లో ఎవరూ ఎన్నికలను ఢీకొట్టే సత్తా కలిగిన వారు కాకపోవడంతో దిక్కుతోచని స్థితి నెలకొంది. బీఆర్ఎస్, కాంగెస్ పార్టీల్లో టికెట్లు దక్కని వారు అసంతృప్తితో ఉంటే వారిని బీజేపీలోకి తీసుకుని టికెట్టు ఇవ్వాలన్న ఆలోచనతో ఉన్నట్లు సమాచారం. దీంతో ఇప్పటి వరకు బీజేపీ కూడా అభ్యర్థులను ప్రకటించలేకపోయింది. షెడ్యూల్ ఖరారైన నేపథ్యంలో ప్రచారంలో దూసుకుపోతున్న బీఆర్ఎస్ను ఎదుర్కోవడానికి ఇక నుంచి కాంగ్రెస్, బీజేపీలు తమ కసరత్తును మొదలుపెట్టే పనిని ముమ్మరం చేయనున్నాయి.