నీలగిరి, నవంబర్ 04 : బాల్య వివాహాల నివారణకు ప్రతి ఒక్కరికి సంపూర్ణ అవగాహన కల్పించాలని నల్లగొండ సీడీపీఓ తూముల నిర్మల అన్నారు. మంగళవారం మర్రిగూడ హైస్కూల్ విద్యార్ధినీలకు అక్రమ దత్తత, బాల్య వివాహాల వల్ల కలిగే నష్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈసందర్భంగా సీడీపీఓ మాట్లాడుతూ.. అమ్మాయిలు 18 సంవత్సరాలు వచ్చాక మాత్రమే వివాహం చేసుకోవాలన్నారు. చిన్న వయస్సులో వివాహాలు చేయడం వల్ల వారికి పుట్టే పిల్లల్లో జన్యు పరమైన సమస్యలు ఉత్పన్నమౌతాయన్నారు. బాలికలకు యుక్త వయస్సు వచ్చిన వెంటనే వివాహాలు చేసి తల్లిదండ్రులు చేతులు దులుపుకుంటున్నట్లు తెలిపారు.
అలా చేయడం వల్ల భవిష్యత్లో వారు అనేక కుటుంబ సమస్యలతో పాటు ఆరోగ్య, మానసిక సమస్యలను ఎదుర్కొంటారన్నారు. బాల్య వివాహాలు అరికట్టేందుకు ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు. పిల్లల దత్తత చాలా సులభం అని, ప్రభుత్వమే ఆ అవకాశం కల్పించినందున ప్రతి ఒక్కరు ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం దత్తత తీసుకోవాలని, అవిధంగా చుట్టుపక్కల వారికి అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ పార్వతి, అంగన్వాడీ టీచర్లు ఉషశ్రీ, శంకరమ్మ, స్వర్ణలత, సఖీ కేంద్ర నిర్వాహకులు రమాదేవి, చంద్రకళ పాల్గొన్నారు.