నల్లగొండ విద్యా విభాగం (రామగిరి), మార్చి 25 : విద్యార్థులు తాము చదివే కోర్సుల్లోని సబ్జెక్ట్లపై నైపుణ్యాలు సాధించాలని, ఆ దిశగా జీవితంలో స్థిరపడేందుకు ప్రణాళికలు వేసుకుని ముందుకు సాగితే స్వయం ఉపాధి రంగంలో రాణించవచ్చని ఎంఎస్ఎంఈ సంస్థ బాధ్యులు, అధ్యాపకులు జె.కోటేశ్వరరావు అన్నారు. నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ విభాగం ఆధ్వర్యంలో వాలంటీర్లకు, యూనివర్సిటీలో చదివే విద్యార్థులకు మంగళవారం స్వయం ఉపాధి పథకాలు, అవకాశాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యువతకు, విద్యార్థులకు అందిస్తున్న అవకాశాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆత్మ నిర్భరభారత్ వికాసిత్ భారత్ లాంటి కార్యక్రమాలు విద్యార్థులకు ఏ విధంగా ఉపయోగపడతాయో వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం కల్పించే అవకాశాలను సైతం వివరించారు.
వర్సిటీ కో ఆర్డినేటర్ పసుపుల మద్దిలేటి మాట్లాడుతూ.. విద్యార్థులకు విద్యతో పాటు సమాజ సేవ చేసేందుకు చక్కటి వేదిక ఎన్ఎస్ఎస్ అన్నారు. అయితే ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో విద్యార్థులకు నిర్వహించే కార్యక్రమాలను సద్వినియోగం చేసుకుని జీవితంలో రాణించేందుకు ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు. దానిలో భాగంగానే పలు స్వయం ఉపాధి కోర్సులపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు.
అనంతరం కోటేశ్వరరావును ఘనంగా సన్మానించి జ్ఞాపికలు అందజేశారు ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సోషల్ సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ అరుణప్రియ, సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ప్రేమ్ సాగర్, ఆర్ట్స్ కళాశాల ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి డాక్టర్ ఆనంద్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Self-Employment : స్వయం ఉపాధి అవకాశాలపై విద్యార్థులకు అవగాహన