నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డితో బీఆర్ఎస్ నేతలపై కాంగ్రెస్ గూండాలు దాడి చేశారు. మున్సిపల్ చాంబర్ బయట కూర్చున్న కంచర్లపై మంగళవారం ఒక్కసారిగా తీవ్రమైన పదజాలంతో దూషిస్తూ దూసుకొచ్చిన మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్‌రెడ్డి, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు గుమ్ముల మోహన్‌రెడ్డి, వారి అనుచరులు కుర్చీలు, పూలకుండీలు విసిరి దాడి చేశారు. దీంతో ఒక్కసారిగా అక్కడ వాతావరణంగా ఉద్రిక్తంగా మారింది.
బీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణులు మధ్య తోపులాట జరిగింది. తేరుకున్న పోలీసులు ఇరువర్గాలను రెండువైపులా చెదరగొట్టారు. బీఆర్ఎస్ నేతలను సీసీ చాంబర్‌కు, కాంగ్రెస్ శ్రేణులను రెవెన్యూ సెక్షన్లోకి తోశారు. దాడిలో సొమ్మసిల్లిపోయిన కంచర్లను సీసీ చాంబర్లో నీరు తాగించి ఆయనను అయన వెంట ఉన్న ముఖ్యనాయకులను బలవంతంగా బయటకు ఎత్తుకొచ్చి నాంపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ క్రమంలో ఒక్కసారిగా మున్సిపల్ కార్యాలయం ప్రాంగణం యుద్ధ వాతావరణంగా మారిపోయింది. కాంగ్రెస్ గూండాల దాడిలో కొంతమంది బీఆర్ఎస్ కార్యకర్తలకు గాయాలయ్యాయి. ఫ్లెక్సీల మాటున పథకం ప్రకారం దాడి.
నల్లగొండ కేటీఆర్ మహా ధర్నా సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల మాటున మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డిపై కాంగ్రెస్ నాయకులు దాడి చేసి హత్యాయత్నానికి ప్రయత్నించారు. అధికార మదంతో దాడి చేసేందుకు వీలుగా పోలీసులను సైతం కాంగ్రెస్ గూండాలు వాడుకున్నారు. నల్లగొండ పట్టణంలో ఫ్లెక్సీల విషయంలో కమిషనర్ స్పందించకపోవడం, కంచర్ల పార్టీ నాయకులు, కార్యకర్తలతో మున్సిపల్ ఆఫీసుకు రావడంతో కాంగ్రెస్ నాయకులు దాడికి పథకం పన్నినట్లు తెలుస్తున్నది.
సుమారు రెండువందలకు పైగా మున్సిపాలిటీ వద్దకు చేరుకున్న కాంగ్రెస్ నాయకులు ఒక్కసారిగా చైర్మన్ చాంబర్‌ను నుంచి కిందికి దిగి తీవ్రమైన పదజాలంతో కంచర్ల వైపు దూసుకువచ్చారు. వారు వస్తుంటే ముగ్గురు సీఐలు ఎనిమిది మంది ఎస్ఐలు ఉన్నా కూడా అపలేదు. సుమారు రెండువందల మంది వరకు కాంగ్రెస్ శ్రేణులు మున్సిపల్ కార్యాలయంలో గుమిగూడినా పట్టించుకోలేదంటే పోలీసుల వైఖరి ఏమిటో స్పష్టంగా అర్థమవుతుంది. భూపాల్‌రెడ్డి చాంబర్లో ఉన్నప్పటికీ కావాలనే నల్లగొండ టూటౌన్ సీఐ రాఘవరావు ఆయనను బయటకు ఎత్తుకొచ్చారు. అరెస్టు చేసి స్టేషన్‌కు తీసుకెళ్లకుండా చాంబర్ బయట ఉంచారు. భూపాల్‌రెడ్డిపై దాడికి పోలీసులు కూడా పరోక్షంగా సహకారం అందించారనే చెప్పాలి.
నల్లగొండ పట్టణంలో కేటీఆర్ రైతు మహాధర్నా సందర్భంగా ప్లెక్సీలను బీఆర్ఎస్ శ్రేణులు ఏర్పాటు చేశాయి. బీఆర్ఎస్తోపాటు కాంగ్రెస్ శ్రేణులు కూడా సంక్రాంతి, నూతన సంవత్సర సందర్భంగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేశాయి. కానీ మున్సిపాలిటీ అధికారులు ధర్నాకు అనుమతి లేదని సోమవారం రాత్రి నుంచే ఫ్లెక్సీలను తొలగిస్తున్నారు. ఈవిషయం కమిషనర్‌కు చెప్పాలని ఫోన్ చేయడంతో అయన లిఫ్ట్ చేయలేదు. రాత్రి సమయంలో సరైందికాదని ఆయన ఉదయం కూడా కమిషనర్‌కు ఫోన్ చేశారు. కానీ కమిషనర్ నుంచి స్పందన రాకపోవడం, ఫ్లెక్సీల తొలగింపు కార్యక్రమం జరుగుతుండడంతో చేసేది లేక ఆయనే స్వయంగా బీఆర్ఎస్ కార్యకర్తలతో మున్సిపాలిటీకి కంచర్ల వచ్చారు.
కమిషనర్ లేకపోవడంతో ఆయన చాంబర్లో కూర్చొని కమిషనర్‌కు ఫోన్ చేశారు. కానీ అయన నుంచి స్పందన రాకపోవడంతో కార్యకర్తలతో అక్కడే బైఠాయించి కమిషనర్ రావాలంటూ నినాదాలు చేశారు. ఈ క్రమంలో పోలీసుల వచ్చి వారికి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. కానీ కమిషనర్ వచ్చేంత వరకు ఇక్కడే ఉంటామని భీష్మించుకుని కూర్చున్నారు. దీంతో చేసేది లేక బీఆర్ఎస్ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
చాంబర్లో కేవలం మాజీ ఎమ్మెల్యే కంచర్ల, మాజీ మున్షిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, కౌన్సిలర్లు అభిమన్యు శ్రీనివాస్, మాదగోని గణేశ్, కోఅప్షన్ సభ్యులు జమాల్‌ఖాద్రి మాజీ కౌన్సిలర్లు మాత్రమే ఉన్నారు. సుమారు గంటపాటు వారు అక్కడే ఉన్నారు. ఇంతలోనే పోలీసులు వీరిని అరెస్టు చేసేందుకు ప్రయత్నించారు. మరోవైపు కమిషనర్ చాంబర్లో అందోళన చేస్తున్న విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు గుమ్ముల మోహన్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్‌రెడ్డి అక్కడకు చేరుకుని చైర్మన్ చాంబర్లోకి వెళ్లారు. ఒక్కొక్కరుగా కాంగ్రెస్ కౌన్సిలర్లు, ఇతర నాయకులు వందలాది మంది అక్కడకు చేరుకున్నారు. సుమారు ఈ హైడ్రామా అంతా రెండుగంటలపాటు సాగింది.