ఆత్మకూర్.ఎస్, మార్చి 18 : ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రతి మేజర్ గ్రామ పంచాయతీలో ఓపెన్ జిమ్‌లను ఏర్పాటు చేసింది. కొవిడ్ నేపథ్యంలో సమాజంలో ఆరోగ్య స్ప్రహ పెరగడంతో చిన్నా, పెద్ద అంతా ఈ జిమ్‌లను వినియోగించుకునేవారు. అయితే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ నిర్వహణ లేమితో లక్షలు వెచ్చించి ఏర్పాటు చేసిన పరికరాలు తుప్పు పడుతున్నాయి. ఇదే దారిలో సూర్యాపేట జిల్లా ఆత్మకూర్.ఎస్ మండల కేంద్రంలోని జిమ్ నిరుపయోగంగా మారింది.
మండల కేంద్రంలో దాదాపు రూ.3 లక్షలు కేటాయించి ఓపెన్ జిమ్ ఏర్పాటు చేశారు. ప్రజల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన ఈ జిమ్ము ఇంతవరకు వినియోగంలోకి రాలేదు. ఎప్పుడు చూసినా గేటుకు తాళం వేసి ఉండడంతో యువకులు వెనుతిరిగి వెళ్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి జిమ్‌ను వినియోగంలోకి తేవాలని గ్రామస్తులు కోరుతున్నారు. అలాగే జిమ్ ఊరి బయట కాకుండా ఊరి మధ్యన ఏర్పాటు చేయవలసిందిగా విజ్ఞప్తి చేశారు.