చిట్యాల, ఏప్రిల్ 25 : ఏటీఎంలో నగదు చోరీ చేసి, పోలీసుల కళ్లుగప్పి పరారైన నిందితుల సంఘటన మండల కేంద్రమైన చిట్యాలలో చోటు చేసుకుంది. పోలీసులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన సమాచారం ప్రకారం నలుగురు నిందితులు ఆంధ్రప్రదేశ్‌లోని ఓ ఏటీఎంలో చోరీ చేసి దాదాపు రూ. కోటిన్నర నగదుతో ఏపీ 40 ఎఫ్ఎల్ 0512 నంబరు గల కారులో హైదరాబాదు వైపు పారిపోతున్నట్లు చిట్యాల పోలీసులకు సమాచారం అందింది. దీంతో చిట్యాల ఎస్ఐ రవికుమార్ శనివారం మధ్యాహ్నం పట్టణంలోని యూనియన్ బ్యాంకు సమీపంలో వాహనాలను తనిఖీ చేస్తున్నారు.
ఈ క్రమంలో నిందితులు పోలీసులను చూసి తమ వాహనాన్ని హైవేపై యూ టర్న్ తీసుకొని వ్యతిరేక మార్గంలో విజయవాడ వైపు పారిపోతున్నారు. ఇది గమనించి చిట్యాల పోలీసులు తమ వాహనంలో వారిని వెంబడించారు. పోలీసులను గమనించిన నిందితులు చిట్యాల ఎస్బీఐ సమీపంలో సర్వీసు రోడ్డులోకి వెళ్లి కొంత దూరం వెళ్లిన తర్వాత వేణుగోపాల స్వామి వెంచర్లోకి ప్రవేశించారు. వెనుకనే పోలీసులు వెంబడించడాన్ని గమనించి ఓ వెంచర్‌లోని రూం వద్ద చెట్ల చాటున కారు నిలిపి, నగదుతో పారిపోయారు. పోలీసులు అక్కడకు చేరుకునే లోపే వారు ఉడాయించారు.
అనంతరం పోలీసులు కారు అద్దాలు పగులగొట్టి లాక్ తీశారు. క్లూస్ టీం సభ్యులు వచ్చి వేలిముద్రలు సేకరించారు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. కాగా కారులో నలుగురు నిందితులు ఉండగా ఇద్దరు నగదుతో వెంచర్ కాంపౌండ్‌లోకి దూకి పారిపోయినట్లు, మరో ఇద్దరు నడుచుకుంటూ కాలనీ వైపు వెళ్లినట్లు తెలిసింది.