ఇటు ధాన్యం కొనుగోళ్లు, అటు పత్తి కొనుగోళ్లలోనూ రైతన్నను అదును చూసి మోసం చేస్తున్నారు. ఒకేసారి మార్కెట్‌కు వస్తున్న పంట ఉత్పత్తులను ఆసరాగా చేసుకుని మద్దతు ధరకు ఎగనామం పెడుతున్నారు. దాంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో నిత్యం ఏదో ఒకచోట రోడ్డెక్కున్నారు. సోమవారం ధాన్యం రైతులు వేములపల్లి మండలం శెట్టిపాలెం వద్ద ఆందోళనకు దిగగా, పత్తి రైతులు కొండమల్లేపల్లిలో రాస్తారోకో చేశారు. ఎక్కడైనా మద్దతు ధరకు తమ పంటను కొనుగోలు చేయాలన్నది ఒక్కటే డిమాండ్.
– నల్లగొండ ప్రతినిధి, నవంబర్11(నమస్తే తెలంగాణ)
ఉమ్మడి నల్లగొండ జిల్లావ్యాప్తంగా వానకాలం ధాన్యం మార్కెట్లను ముంచెత్తుతున్నది. దొడ్డురకాలు ఐకేపీ, పీఏసీఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తుండగా, సన్నరకం ధాన్యం నేరుగా రైస్‌మిల్లుల వద్దకే వెళ్తున్నది. ఈ సీజన్లో సహజంగానే సన్నాలు ఎక్కువగా పండిస్తుంటారు. ముఖ్యంగా సాగర్ ఎడమ కాల్వ ఆయకట్టులో మెజార్టీ భాగం రైతులు సన్నాలనే సాగు చేశారు. దాంతో ప్రస్తుతం సన్న వడ్లు ఎక్కువగా మార్కెట్లోకి వస్తున్నాయి. సన్న వడ్లను ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో అమ్మే పరిస్థితి లేదు. అక్కడ 17శాతం తేమ ఉంటేనే కొనుగోలు చేస్తారు. కానీ సనాల్లో అంత తేమ అసాధ్యం అవడంతో రైతులు నేరుగా రైస్ మిల్లులను ఆశ్రయిస్తున్నారు. అక్కడ కూడా దాదాపు ప్రభుత్వ మద్దతు ధర మేరకు వస్తుందనేది రైతుల భావన. గతేడాది క్వింటా సన్నాలకు రూ.2,800 వరకు ధర పలికింది.
ప్రస్తుత సీజన్లోనూ రైతులు అదే ఆశాభావంతో మిల్లులకు సన్నవడ్లను తీసుకెళ్తున్నారు. కానీ ధర విషయంతో తీవ్ర అన్యాయం జరుగుతున్నది. వారం రోజుల కిందటి వరకు రూ.2,200 నుంచి రూ.2,400 వరకు ధర చెల్లించారు. ఆ తర్వాత నిత్యం 3 వేలకు పైగా ట్రాక్టర్ల ధాన్యం మిల్లులకు వస్తుండడంతో రైస్ మిల్లర్లు సిండికేట్‌గా మారి సన్నాలకు ధర తగ్గించారు. క్వింటాకు రూ.2,100 నుంచి రూ.2,200 వరకు మాత్రమే చెల్లిస్తామని కరాఖండిగా చెప్తున్నారు. నాణ్యత, తేమ సాకులు చెప్తూ ధర తగ్గిస్తున్నారు. దాంతో రైతులు ఒక్కో కింటాలుపై రెండు, నుంచి మూడు వందల వరకు నష్టపోతున్నారు. అలా కడుపు మండిన రైతులు ఆక్రోశంతో రోడ్లెక్కుతున్నారు.
ఆదివారం వేములపల్లి మండలం శెట్టిపాలెం వద్ద, మిర్యాలగూడ మండలం యాద్గార్పల్లి వద్ద రైతులు ఆందోళనకు దిగారు. రోడ్లపై బైఠాయించి మిల్లర్ల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తర్వాత అధికారులు జోక్యం చేసుకుంటే కొద్దిసేపు ప్రభుత్వ మద్దతు ధర రూ.2,320కి అటూఇటూగా ధర చెల్లించి కొనుగోళ్లు జరిపారు. సాయంత్రానికి తిరిగి ధరలో తిరకాసు పెట్టారని రైతులు వాపోతున్నారు. సోమవారం మళ్లీ ధర విషయంలో మిల్లర్లు పేచీకి దిగారు.
దాంతో మరోసారి రైతులు శెట్టిపాలెం వద్ద నార్కట్‌పల్లి-అద్దంకి రహదారిపై బైఠాయించారు. రైస్ మిల్లర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దాంతో జాయింట్ కలెక్టర్, మిర్యాలగూడ స్పెషల్ కలెక్టర్ అక్కడికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశారు. అయినా సరే రైస్‌మిల్లర్లు సరైన ధర చెల్లించేందుకు ససేమిరా అంటున్నారు. ఇలాంటి సమయంలో ప్రభుత్వం నిత్యం ప్రత్యేక అధికారులతో పర్యవేక్షించాల్సిన అవసరం ఉంది.
గతంలో బీఆర్ఎస్ హయాంలో మద్దతు ధరపై రైస్ మిల్లర్లు పేచి పెడితే కేసీఆర్ సర్కార్ తీవ్రంగా పరిగణించేది. ఏకంగా రైస్ మిల్లుల వారీగా ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేసి కొనుగోళ్లను పర్యవేక్షించింది. ఒక సివిల్ సప్లయ్ అధికారి, రెవెన్యూ, పోలీస్, మార్కెటింగ్, తూనికలు, కొలతల అధికారులతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి రైతులకు అండగా నిలిచేది. రైస్ మిల్లర్లు తేడా చేస్తే కేసులకు సైతం వెనుకాడలేదు. కానీ ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అలా స్పందిస్తున్న దాఖలాలే లేవు. ఇప్పటివరకు జిల్లా మంత్రులు ధాన్యం కొనుగోళ్లపై ప్రత్యేకంగా సమీక్షించ లేదు. ఉమ్మడి జిల్లాకు చెందిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డినే సివిల్ సప్లయ్ మంత్రిగా ఉన్నా నేటికీ ధాన్యం కొనుగోళ్లపై సమీక్ష జరిపిన దాఖలాలు లేవు. మరో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కూడా అటూవైపు కూడా కన్నెత్తి చూడడం లేదు. నిత్యం రైతులు ఆందోళనలు చేస్తున్నా మంత్రులకు కనీసం పట్టడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
మరోవైపు ఉమ్మడి జిల్లా పరిధిలో చేతికి వచ్చిన పత్తి పంటను అమ్మకోవడం రైతులకు పెద్ద ప్రహసనంగా మారింది. జిల్లాలో 7 సీసీఐ క్లస్టర్లలో 23 జిన్నింగ్ మిల్లుల్లో పత్తి కొనుగోలో కేంద్రాలను ఏర్పాటు చేశారు. అవి కూడా ఆలస్యమవడంతో అప్పటికే తొలిదశలో వచ్చిన నాణ్యమైన పత్తిని రైతులు దళారులకు విక్రయించారు. ఎక్కువ మంది గ్రామాల్లోనే రూ.5,800 నుంచి రూ.6300 వరకు విక్రయించారు. ఆ తర్వాత వస్తున్న పత్తిని అమ్ముకుందాం అంటే సీసీఐ కేంద్రాల్లో సవాలక్ష కొర్రీలు పెడుతున్నారు. పత్తికి ప్రభుత్వం మద్దతు ధర రూ.7,521 ప్రకటించగా.. తేమ శాతం, ఇతర సాకులతో సీసీఐ అధికారులు కొనుగోళ్లకు నిరాకరిస్తున్నారు. రైతులు తీసుకువచ్చిన పత్తిని వెనక్కి తిప్పి పంపిస్తున్నారు. దాంతో పత్తి రైతులు రోజూ ఎక్కడో ఓ చోట ఆందోళనలు చేస్తున్నారు. మరోవైపు సీసీఐ వ్యవహారం, ప్రభుత్వ తీరుతో విసుగెత్తిన జిన్నింగ్ మిల్లుల యాజమాన్యాలు సోమవారం నుంచి పత్తి కొనుగోళ్లను నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి. దాంతో సోమవారం జిల్లా అంతటా పత్తి కొనుగోళ్లు నిలిచిపోయాయి. సీసీఐ కొనుగోలు కేంద్రాల వద్ద పత్తి లోడ్లతో వచ్చిన వాహనాలు భారీగా బారులు తీరాయి. దాంతో పత్తి రైతులు కొండమల్లేపల్లితోపాటు పలుచోట్ల ఆందోళనకు దిగారు. ప్రభుత్వ పర్యవేక్షణ లేక అధికారులు పట్టించుకోక అటు వరి, ఇటూ పత్తి పండించిన రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.
పత్తి కొనుగోళ్లను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో సమస్య తీవ్రంగా మారింది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎలాంటి ఆంక్షలూ లేకుండా పత్తి కొనుగోలు చేశారు. అప్పట్లో 40ఎకరాల పత్తిని 24 గంటల్లో అమ్ముకొని పోయేవాళ్లం. కాంగ్రెస్ ప్రభుత్వంలో పత్తి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పత్తి కొనుగోలుపై సీసీఐ కొర్రీల మీద కొర్రీలు పెడుతున్నది.
-ఉండ్ర మాధవరెడ్డి, రైతు, ఈదులూరు (కట్టంగూర్ మండలం)