నల్లగొండ, మార్చి 20 : నల్లగొండ గడియారం సెంటర్ వద్ద మండుటెండలో సిఐటియు ఆధ్వర్యంలో ఆశా వర్కర్లు శుక్రవారం నిరసన తెలిపారు. తమ డిమాండ్ల సాధనకై స్థానిక మంత్రి కార్యాలయం ఇందిరా భవన్ ముట్టడికి యత్నించి అక్కడే బైఠాయించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ.. ఆశా వర్కర్లకు రూ.18 వేల ఫిక్స్డ్ వేతనం వెంటనే అమలు చేయాలన్నారు. ఆశా వర్కర్లకు ఉద్యోగ భద్రత కల్పించి, పర్మినెంట్ ఉద్యోగులుగా గుర్తించాలన్నారు. ఆశాల అన్ని సమస్యల పరిష్కారానికి ఎన్హెచ్ఎం కింద తగిన నిధులు కేటాయించాలన్నారు. ఆశా వర్కర్లపై పెరుగుతున్న పనిభారం తగ్గించి, అదనపు భత్యాలు ఇవ్వాలన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని సంక్షేమ పథకాల ప్రయోజనాలను ఆశా వర్కర్లకు కూడా వర్తింపజేయాలని కోరారు.
గర్భిణీలు, శిశు సంరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్న ఆశాలకు ప్రత్యేక గౌరవ వేతనం ఇవ్వాలని, ప్రమాద బీమా, ఆరోగ్య బీమా, పెన్షన్ వంటి సదుపాయాలు కల్పించాలని తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ (సిఐటియు) నల్లగొండ జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి సలీం, దండంపల్లి సత్తయ్య, జిల్లా ఉపాధ్యక్షుడు లకపాక రాజు, పింజర్ల సైదులు, ఆశా కార్యకర్త జిల్లా అధ్యక్షురాలు మహేశ్వరి, వెంకటమ్మ, సునీత, సిఐటియు కార్యకర్తలు పాల్గొన్నారు.