– 950 మంది సిబ్బందితో పటిష్ఠ బందోబస్తు
– జిల్లా వ్యాప్తంగా 5,984 విగ్రహాల ఏర్పాటు
– శోభాయాత్ర సందర్భంగా నల్లగొండ పట్టణ కేంద్రంలో ట్రాఫిక్ డైవర్షన్
నీలగిరి, సెప్టెంబర్ 03 : నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఈ నెల 5వ తేదీ శుక్రవారం నిర్వహించే గణేష్ నిమజ్జన శోభాయాత్రను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా పోలీస్ యంత్రాంగం ముందస్తు భద్రతా చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. జిల్లాలోని అన్ని ప్రధాన రహదారులతో పాటు వివిధ కాలనీల్లో ఏర్పాటు చేసిన కమ్యూనిటీ సీసీ టీవీ కెమెరాలతో పాటు ప్రత్యేకంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి జిల్లా పోలీస్ కార్యాలయానికి అనుసంధానం చేసినట్లు చెప్పారు. నల్లగొండ పట్టణ కేంద్రంలో 9 అడుగుల లోపు విగ్రహాలు నల్లగొండ పట్టణంలోని వల్లభ రావు చెరువు వద్ద నిమజ్జనానికి ఏర్పాటు చేయడం జరిగిందని, 9 అడుగులకు పైబడిన విగ్రహాలు 14వ మైలురాయి (అలీ నగర్) వద్ద నిమజ్జనానికి ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.
జిల్లాలోని పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రధాన రహదారులు, నల్లగొండ పట్టణంతో పాటు మిర్యాలగూడ, దేవరకొండ వంటి ప్రధాన పట్టణాల్లో గణేష్ నిమజ్జన శోభయాత్రను 24/7 జిల్లా పోలీస్ కార్యాలయం కమాండ్ కంట్రోల్ పర్యవేక్షిస్తుందని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 1,500 సీసీ టీవీ కెమెరాలను ఆయా పోలీస్ స్టేషన్లకు అనుసంధానం చేసినట్లు వెల్లడించారు.
జిల్లాలోని ప్రధాన నిమజ్జన ప్రాంతాలైన నల్లగొండ పట్టణంలోని వల్లభరావు చెరువు, మూసీ నది, 14వ మైలు రాయి, వాడపల్లి, నాగార్జునసాగర్, దయ్యాలగండి, అడవిదేవులపల్లి, కొండబీమనపల్లి, డిండి వద్ద పోలీస్ శాఖ భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పోలీస్ పికెట్లు, ప్లడ్ లైట్లు, క్రేన్లు ఏర్పాటు చేశామని, నిమజ్జనం జరిగే ప్రాంతాల్లో గజ ఈతగాళ్లను అందుబాటులో ఉన్నారు. ఎక్కడా ఎలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవడంతో పాటు జిల్లాలో ఏ ప్రాంతానికి వెళ్లినా ఐదు నుంచి పది నిమిషాల వ్యవధిలో పెట్రో వాహనాలు, బ్లూకోట్స్, సంబంధిత పోలీసు అధికారులు అప్రమత్తమయ్యేలా ఆన్లైన్ విధానంలో భద్రతను పర్యవేక్షిస్తున్నారు.
నిమజ్జనం రోజున జిల్లా కేంద్రంలోని ప్రజలకు, వాహనదారులకు శోభాయాత్ర సందర్భంగా ట్రాఫిక్కు అంతరాయం కలుగకుండా డైవర్షన్ ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ తెలిపారు. వినాయక ఉత్సవ కమిటీ నిర్వాహకులు శోభాయాత్రకు నిర్దేశించిన మార్గం గుండా వెళ్తూ ట్రాఫిక్ అంతరాయం కలుగకుండా పోలీసు వారికి సహకరించాలన్నారు.
– హాలియ, దేవరకొండ నుండి హైదరాబాద్కు వెళ్లే వాహనాలను JM గౌడ్ X రోడ్డు, ఈద్గా వయా మునుగోడు బై పాస్, ఐటీ హబ్ మీదుగా మళ్లించడమైనది.
– మిర్యాలగూడ నుండి హైదరాబాద్ వెళ్లే వాహనాలు తిప్పర్తి, నకిరేకల్,నార్కట్పల్లి మీదుగా హైదరాబాద్ వైపు మళ్లింపు
– హైదరాబాద్ నుండి మిర్యాలగూడ వెళ్లే వాహనాలు నార్కట్పల్లి, నకేరేకల్ వయా తిప్పర్తి మీదుగా మిర్యాలగూడకు మళ్లించడమైనది
– హైదరాబాద్ నుండి హాలియ, దేవరకొండకు వెళ్లే వాహనాలు ఐటీ హబ్, మునుగోడు బై పాస్, ఈద్గా వయా JM గౌడ్ X రోడ్డు మీదుగా మళ్లింపు
గణేష్ నిమజ్జన శోభాయాత్ర సందర్భంగా జిల్లా పోలీశ్ శాఖ భారీ భద్రతను ఏర్పాటు చేసింది. ఎస్పీ, ఏఎస్పీ, ఆడిషనల్ ఎస్పీ, ఐదుగురు డీఎస్పీలు, 23 మంది సీఐలు, 60 మంది ఎస్ఐలు, 850 మందికి పైగా ఏఎస్ఐలు, కానిస్టేబుళ్లు, మహిళా కానిస్టేబుల్స్, హోంగార్డులు, బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్, ఏఆర్ సిబ్బంది, స్పెషల్ పార్టీతో కలిపి మొత్తం 950 మంది బందోబస్తు విధుల్లో పాల్గొననున్నారు.
గణేష్ నిమజ్జన శోభాయాత్రకు సంబంధించి నిర్వాహాకులకు పోలీస్ శాఖ ఇప్పటికే పలు సూచనలు చేసిందని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు.