ప్రాథమిక చికిత్సలన్నీ అక్కడే..
అందుబాటులో లేని వైద్యం కోసం పెద్యాస్పత్రులకు రిఫర్
నేరేడుచర్ల, జూలై 18 : ప్రభుత్వ నిధులు ప్రైవేటు ఆస్పత్రులపాలు కాకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. ఇందులో భాగంగా ఆరోగ్యశ్రీ పథకాన్ని ఆధునీకరిస్తున్నది. ఈ పథకంలో 70శాతం నిధులు ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్తున్నాయని గ్రహించిన సర్కారు.. ప్రభుత్వ దవాఖానల్లో ఆరోగ్యశ్రీని ప్రవేశపెట్టి వైద్య సేవలు అందించాలని నిర్ణయించింది.
జిల్లాలోని అన్ని మండలాల్లో ఈ సేవలు కొనసాగుతున్నాయి. కొన్ని ప్రధాన ఆస్పత్రులకు ప్రస్తుతం ఉన్న వైద్యులతోపాటు స్పెషలిస్టులను ప్రభుత్వం కేటాయిస్తున్నది. దీంతోపాటు మెరుగైన వైద్య సేవలు అందించేలా వైద్యులు, సిబ్బందికి ప్రోత్సాహకాలు అందిస్తున్నది. పీహెచ్సీలో గర్భిణికి సాధారణ ప్రసవం చేస్తే వైద్యుడికి, సిబ్బందికి ప్రోత్సాహం కింద రూ.3వేలు ఇస్తున్నది. అంతేకాకుండా పీహెచ్సీ నిర్వహణలో సిబ్బందికి పరికరాలు, ఇతర వైద్య అవసరాలను వెంటనే తీర్చుకునే వెసులుబాటును కల్పించింది. వైద్యులకు, సిబ్బందికి ప్రత్యేక అలవెన్సులు, ఓపీ, ఇతర చికిత్సల ఆధారంగా నగదు రూపంలో నజరానాలు ఇవ్వనుంది.
ఆరోగ్యశ్రీ యాప్ ద్వారా పెద్దాస్పత్రుల్లో వైద్యం
పీహెచ్సీలకు వచ్చే రోగులు ఆరోగ్యశ్రీ కార్డును విధిగా తీసుకురావాలి. దీని వల్ల రోగికి ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నాయో వైద్యుడు పరీక్షించి పీహెచ్సీ స్థాయిలో చికిత్స అయితే అక్కడే చేసి పంపిస్తారు. ఒకవేళ అక్కడ వైద్య చికిత్సలు అందుబాటులో లేకుంటే వైద్యుడి వద్ద ఉన్న ఆరోగ్యశ్రీ యాప్ ద్వారా అతడి రోగాన్ని ఎంట్రీ చేసి.. ఎక్కడ సరైన వైద్య చికిత్స ఉంటే అక్కడికి అప్రూవల్ పంపిస్తారు. అప్రూవల్ రాగానే వెంటనే సంబంధిత రోగిని ఆ ఆస్పత్రికి పంపించి ఉచితంగా వైద్య చికిత్స చేయిస్తారు. ఆరోగ్యశ్రీ యాప్ వైద్యారోగ్య శాఖలోని వైద్యాధికారులు, ఆరోగ్యమిత్రల వద్ద అందుబాటులో ఉంటుంది.
అందుబాటులో ఆరోగ్యశ్రీ సేవలు
వైద్యులకు అందుబాటులో ఉండే విధంగా ఆరోగ్యశ్రీని ప్రభుత్వం ప్రారంభించింది. జిల్లా జనరల్ ఆసుపత్రి, హుజూర్నగర్ ఏరియా ఆసుపత్రి, కోదాడ, తుంగతుర్తి, నడిగూడెంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్లతోపాటు నాలుగు అర్బన్ హెల్త్ సెంటర్లు, 23 పీహెచ్సీల్లో ప్రారంభించారు. నేరేడుచర్ల, పెన్పహాడ్, మఠంపల్లి, మేళ్లచెర్వు, చిలుకూరు, అర్వపల్లి, తిరమలగిరి పీహెచ్సీల్లో 24 గంటలు వైద్య సేవలు అందుతున్నాయి. గతంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో డెలివరీలు, ప్రాథమిక చికిత్సలకు మాత్రమే పరికరాలు ఉండేవి. ఇప్పుడు డెలివరీలతోపాటు స్కానింగ్ పరికరాలు కూడా ఏర్పాటు చేయనున్నారు. 53 రకాల రోగాలను పీహెచ్సీలో ఆరోగ్యశ్రీ కింద చేర్చారు. అదేవిధంగా ప్రభుత్వం ఆరోగ్యశ్రీ సంరక్షణ సేవల పేరుతో మొబైల్ యాప్ను రూపొందించింది. ఈ యాప్ ద్వారా రోగి సమస్యలను ఎంటర్ చేసి వారి వివరాలను పొందుపరిస్తే ఎక్కడ ఏ చికిత్స ఉంది.. దానికి కావాల్సిన అప్రూవల్ కూడా వెంటనే వచ్చే అవకాశాలు ఉన్నాయి.
సద్వినియోగం చేసుకోవాలి
పీహెచ్సీల్లో వైగ్య సేవలు ప్రారంభమైనందున ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. ఆరోగ్యశ్రీ కింద శస్త్ర చికిత్సలు అందనున్నాయి. ఆరోగ్యశ్రీ, హెల్త్ కార్డులు, తెల్ల రేషన్ కార్డు లేని వారు తాసీల్దార్ నుంచి ధ్రువీకరణ పత్రం బీపీఎల్గా తీసుకురావాలి.
– నాగయ్య, వైద్యాధికారి, నేరేడుచర్ల