నల్లగొండ, మే 15 : పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను వెంటనే ఉప సంహరించుకోవాలని, ప్రజలపై భారం పడకుండా చూడాలని సిఐటియు నల్లగొండ జిల్లా కార్యదర్శి ఎండీ.సలీం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం నలగొండ జిల్లా కేంద్రంలో పెట్రోల్, డీజిల్ ధరలను కేంద్ర ప్రభుత్వం పెంచడానికి వ్యతిరేకిస్తూ సిఐటియూ ఆధ్వర్యంలో ఆటోని తాడుతో లాగుతూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సలీం మాట్లాడుతూ పెంచిన పెట్రోల్, డీజిల్ గ్యాస్ ధరలను వెంటనే ఉప సంహరించుకోవాలని ఈ ధరలు పెరగడం ద్వారా సామాన్య ప్రజలపై భారం పెరిగే అవకాశం ఉందన్నారు.
గతంలో కేంద్ర మంత్రులు మాట్లాడుతూ తమ ప్రభుత్వంలో ఎటువంటి భారాన్ని ప్రజలపై వేయమని, ధరలు పెంచబోమని మాటలు చెప్పి పది రోజులు కాకుండానే వెంటనే గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను అమాంతం పెంచుతూ ప్రజల నడ్డి విరిచే విధంగా కేంద్ర ప్రభుత్వ వ్యవస్థ ఉన్నదని అన్నారు. డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరలు పెరగడం ద్వారా నిత్యవసర వస్తువుల ధరలు పెరిగే అవకాశం ఉందని వెంటనే ధరలు తగ్గించి పేద ప్రజలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియూ జిల్లా నాయకులు బాణాల పరిపూర్ణ చారి, భీమగాని గణేష్, పోలే సత్యనారాయణ, అద్దంకి నరసింహ, బొల్లు రవీందర్, బొట్టు శివ, పిన్నపరెడ్డి మధుసూదన్ రెడ్డి, శ్రీశైలం, శంకర్, రఘు పాల్గొన్నారు.