Yoga For Kids | పిల్లల ఆరోగ్యానికి యోగా ఎంతో ఉపయోగకరమని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం పిల్లలు చదువులు, స్క్రీన్ టైమ్, ఆటలు వంటి అనేక పనులతో బిజీగా గడుపుతున్నారు. ఈ పరిస్థితుల్లో కొన్ని సులభమైన యోగా ఆసనాలు వారి శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. యోగా వల్ల కండరాలు బలపడటంతో పాటు శరీర సమతుల్యత, శ్వాస నియంత్రణ కూడా మెరుగుపడుతుంది. అలాగే ప్రతిరోజూ యోగా చేయడం వల్ల రోగనిరోధక శక్తి పెరగడం, మంచి నిద్ర రావడం, ఆత్మవిశ్వాసం పెరగడం వంటి ప్రయోజనాలు కూడా ఉంటాయని చెబుతున్నారు. పిల్లల ఆరోగ్యాన్ని మెరుగుపరిచే కొన్ని సులభమైన యోగాసనాల గురించి నిపుణులు వివరిస్తున్నారు.
తాడాసనం పిల్లలకు మంచి ప్రారంభ ఆసనం అని చెప్పవచ్చు.. ఈ ఆసనంలో పాదాలను కలిపి నిటారుగా నిలబడాలి. చేతులను పైకి ఎత్తి శరీరాన్ని పైవైపు చాపాలి. కొద్దిసేపు లోతుగా శ్వాస తీసుకుంటూ ఈ స్థితిలో ఉండాలి. ఇది శరీర భంగిమను మెరుగుపరచడంతో పాటు పిల్లల్లో స్థిరత్వాన్ని పెంచుతుంది.
వృక్షాసనం చెట్టులా నిలబడే ఆసనం. ఒక కాలిపై నిలబడి మరో కాలును తొడ భాగానికి ఆనించాలి. చేతులను నమస్కార ముద్రలో ఉంచి కొద్దిసేపు నిలబడాలి. తరువాత మరో కాలితో కూడా చేయాలి. ఈ ఆసనం పిల్లల్లో ఏకాగ్రత, సమతుల్యతను పెంచడంలో సహాయపడుతుంది. కాళ్ల కండరాలు కూడా బలపడతాయి. అలాగే బాలాసనం పిల్లలకు మానసిక ప్రశాంతతను అందించే ఆసనం. మోకాళ్లపై కూర్చుని ముందుకు వంగి నుదిటిని నేలపై ఉంచాలి. చేతులను ముందుకు చాపి కొద్దిసేపు నెమ్మదిగా శ్వాస తీసుకోవాలి. ఈ ఆసనం వెన్ను, భుజాలు, నడుము భాగాల్లో ఒత్తిడిని తగ్గించడంలో ఉపయోగపడుతుంది.
అధోముఖ శ్వాసాసనం శరీరాన్ని ఇంగ్లీష్ అక్షరం V ఆకారంలో ఉంచే ఆసనం. చేతులు, కాళ్లు నేలపై ఉంచి నడుమును పైకి ఎత్తాలి. కొద్దిసేపు ఈ స్థితిలో ఉండాలి. ఇది చేతులు, భుజాలు, వెన్ను భాగాన్ని బలపరుస్తుంది. పిల్లల్లో శరీర సమన్వయాన్ని కూడా మెరుగుపరుస్తుంది. భుజంగాసనంను కోబ్రా పోజ్గా కూడా పిలుస్తారు. పొట్టపై పడుకుని చేతుల సహాయంతో ఛాతిని పైకి ఎత్తాలి. ఈ ఆసనం వెన్నెముకను బలపరచడంలో సహాయపడుతుంది. అలాగే శ్వాస సామర్థ్యాన్ని పెంచి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. బద్ధకోణాసనం లేదా బటర్‌ఫ్లై పోజ్‌లో కాళ్ల పాదాలను కలిపి మోకాళ్లను బయటకు వంచాలి. చేతులతో పాదాలను పట్టుకుని మోకాళ్లను సున్నితంగా కదిలించాలి. ఇది నడుము భాగానికి మంచి స్ట్రెచ్ ఇస్తుంది. జీర్ణక్రియకు కూడా మేలు చేస్తుంది.
శవాసనం పిల్లలకు విశ్రాంతిని అందించే ముఖ్యమైన ఆసనం. నేలపై సూటిగా పడుకుని చేతులు, కాళ్లు సడలించి కళ్లను మూసుకోవాలి. కొద్దిసేపు నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ విశ్రాంతి తీసుకోవాలి. ఇది ఒత్తిడిని తగ్గించి మంచి నిద్రకు సహాయపడుతుంది. మర్జరాసనం-బిటిలాసనం లేదా క్యాట్-కౌ పోజ్ వెన్నెముకకు మంచి వ్యాయామంగా పనిచేస్తుంది. నాలుగు కాళ్ల స్థితిలో ఉండి శ్వాస తీసుకుంటూ వెన్నును కిందికి వంచాలి. శ్వాస వదులుతూ వెన్నును పైకి వంపుగా మార్చాలి. ఈ కదలికలను కొన్ని సార్లు చేయాలి. ఇది శరీర భంగిమను మెరుగుపరచడమే కాకుండా జీర్ణక్రియకు కూడా సహాయపడుతుంది. ఈ విధంగా రోజూ ఈ ఆసనాలు వేయడం వల్ల పిల్లలు శారీరకంగా, మానసికంగా ధృడంగా తయారవుతారని నిపుణులు చెబుతున్నారు.